తమిళ రాజకీయాల్లో సంచలనం: మహిళా IAS అధికారిణిని వేధించిన కేసులో టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్

తమిళ రాజకీయాల్లో సంచలనం: మహిళా IAS అధికారిణిని వేధించిన కేసులో టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మహిళా IAS అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై టీవీకే నేత,  కళ్లకురిచ్చి నియోజకవర్గ ఎమ్మెల్యే  సి. అరుల్ విఘ్నేష్‌ శుక్రవారం (నవంబర్ 27) అరెస్ట్ అయ్యారు. ఐఏఎస్ అధికారిణిని వేధించిన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ చర్య విజయ్ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బగా మారగా.. ప్రతిపక్షాలకు టీవీకే సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు అస్త్రం లభించినట్లైంది. 

ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌‎పై ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి 2026, నవంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపారని, అనుచితంగా ప్రవర్తించారని, పదేపదే సంప్రదించేందుకు ప్రయత్నిస్తూ వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అయితే, ఒక ఉన్నత స్థాయి మహిళా ఐఏఎస్ అధికారిణిపై అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఆర్. త్రిశూలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‏పై హైకోర్టు విచారణ చేపట్టగా.. మహిళా కలెక్టర్ నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ అసహనం వ్యక్తం చేస్తూ.. వెంటనే సదరు మహిళా అధికారిణితో మాట్లాడి వివరాలు సేకరించాలని ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. 

ఒక జిల్లా కలెక్టర్‌కే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఎస్పీకి ఆమె లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అధికారిణి ఫిర్యాదు మేరకు నవంబర్ 24న కళ్లకురిచ్చి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

 పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం (నవంబర్ 27) ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.