నవంబర్ 28న ఇండియా కూటమి కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ..!

నవంబర్ 28న ఇండియా కూటమి కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ..!

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలతో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‎లో శనివారం (నవంబర్ 28) ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి సమావేశం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పార్లమెంట్‎లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై డిస్కస్ చేయనున్నారు. ఈ కీలక సమావేశానికి హాజరు కావాలని కూటమి నేతలకు ఇప్పటికే సమాచారం అందించారు. అయితే, తన తండ్రి శరద్ పవార్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కూతురు సుప్రియా సూలే ఈ భేటీకి హాజరు కావడం లేదు. 

2026, నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం విషయం తెలిసిందే. లోక్ సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించిన డీలిమిటేషన్‎తో పాటు చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‎లో ప్రవేశపెట్టనుంది. గతంలోనే ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‎లో  ప్రవేశపెట్టగా కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. దీంతో ఈ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చి ఆమోదింపజేసుకునేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. 

రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఉభయ సభల్లో కావాల్సిన మూడింట రెండు వంతుల సంఖ్యా బలాన్ని మోడీ సర్కార్ ఈసారి పక్కా వ్యూహాంతో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‎లో ఆమోదం పొందితే దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. అయితే, డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సౌత్ స్టేట్స్ వాదిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలా ఆమోదింపజేసుకుంటుందనేది దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది.