మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వాడిన.. నానో కారు ధర్మస్థల మ్యూజియంలో..

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వాడిన.. నానో కారు ధర్మస్థల మ్యూజియంలో..

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వాడిన టాటా నానో కారు, పెన్ను ఇకపై ధర్మస్థలలోని ప్రసిద్ధ మంజుషా మ్యూజియంలో కొలువుదీరనున్నాయి. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ వస్తువులను మంజుషా వెహికల్ మ్యూజియంలో ప్రదర్శించేందుకు అందజేసింది.

ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేకు కలాం వాడిన కారు, దానికి సంబంధించిన పత్రాలను ఫౌండేషన్ ప్రతినిధులు అప్పగించారు. ఈ జ్ఞాపకాలను అందుకున్న క్రమంలో వీరేంద్ర హెగ్గడే గతంలో అబ్దుల్ కలాం ధర్మస్థల పర్యటనను గుర్తు చేసుకున్నారు. కలాం సాధారణ వ్యక్తిత్వం, దైవభక్తి, మత సామరస్యం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను ఆయన కొనియాడారు. 

మాజీ రాష్ట్రపతి అధికారిక లాంఛనాలను పక్కన పెట్టి పిల్లలతో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారని... ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన పేర్కొన్నారు. అబ్దుల్ కలాం జీవితం, ఆయన విలువలను గుర్తు చేసే ఈ వస్తువులను ధర్మస్థలకు అప్పగించినందుకు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజేఎం నజీమా మరైకాయర్, సెక్రటరీ ఏపీజేఎం జైనులాబ్దీన్, కో-ఫౌండర్ ఏపీజేఎం షేక్ సలీమ్ కారును, ఇతర పత్రాలను అందజేశారు. వారిని వీరేంద్ర హెగ్గడే గౌరవించారు.