యూపీ యువతకు SP బంపర్ ఆఫర్: నెలకు రూ. 5 వేల భృతి, 25 లక్షల ఉద్యోగాలు

యూపీ యువతకు SP బంపర్ ఆఫర్: నెలకు రూ. 5 వేల భృతి, 25 లక్షల ఉద్యోగాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష సమాజ్‎వాదీ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే ఎన్నికలకు నాలుగు నెలల ముందే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్ పాత్ర - జన్ మన్ కా మేనిఫెస్టో 2027’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం (నవంబర్ 26) విడుదల చేశారు. యువత, రైతులపై ఎస్పీ హామీల వర్షం కురిపించింది. ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.5 వేల భృతి ఇస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

నిరుద్యోగులకు భృతి

ఉపాధి కల్పనపై సమాజ్ వాదీ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతర రంగాల్లో మరో 2 నుంచి 3 కోట్ల ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని పార్టీ తెలిపింది. గ్రాడ్యుయేట్లు ఏదైనా ఉద్యోగం లేదా ఉపాధి పొందే వరకు ప్రతి నెలా రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది.

రైతులకు రుణమాఫీ

వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే రైతులకు తక్షణ రుణమాఫీ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చింది. పాలు, 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పిస్తూ చట్టబద్ధమైన గ్యారెంటీ ఇస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

విద్య, వైద్యం

పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. గతంలో మూసివేసిన 26 వేల ప్రాథమిక పాఠశాలలను మళ్లీ తెరుస్తామని తెలిపింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసే స్కీమ్ మళ్లీ ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

కాగా, 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ అధికారమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం  చేసుకుంటున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ.. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి.