అమెరికాలోని తన కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల విషయంలో ఐబీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తన కన్సల్టింగ్ డిపార్ట్మెంట్లోని మెజారిటీ పోస్టులకు హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను కంపెనీ నిలిపివేసింది. ఈ నిర్ణయంతో భారతీయులతో సహా అనేకమంది విదేశీ నిపుణుల కెరీర్ డైలమాలో పడింది.
ఇమిగ్రేషన్ రూల్స్ వల్ల ఎఫెక్ట్ అయిన ఉద్యోగులు మరో దేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా ఉద్యోగం వదిలి వెళ్లడం అనే 2 ఆప్షన్లలో ఒక దానిని ఎంచుకోవాలని ఐబీఎం సూచించింది. దీని కోసం వారికి 3 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఒకవేళ ఉద్యోగం వదిలి వెళ్లే వారికి 3 నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తామని పేర్కొంది. వారి సేవలు డిసెంబర్ 31తో ముగియనున్నట్లు సమాచారం.
ఉద్యోగులతో మేనేజర్లు విడివిడిగా సమావేశమై ఈ అంశంపై డిస్కస్ చేశారు. అమెరికాలో టెక్ నిపుణుల లభ్యత పెరగడం, క్లయింట్ల అవసరాలు మారడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం ప్రతినిధి తెలిపారు. గతంలో నైపుణ్యం గల సిబ్బంది కొరత ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌లను ఉపయోగించుకున్నామని.. ఇప్పుడు వాటిపై ఆధారపడటం తగ్గిందని కంపెనీ వెల్లడించింది.
అమెరికా నుంచి భారత్‌కు బదిలీ అయ్యే ఉద్యోగులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 'బ్లైండ్' అనే ఫోరమ్‌లో ఒక ఉద్యోగి పంచుకున్న వివరాల ప్రకారం.. భారత్‌కు మారితే జీతం 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉందట. దీనివల్ల ఉద్యోగులు తక్కువ జీతానికి సొంత దేశం రావాలా లేదా అమెరికాలో ఉద్యోగం వదులుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారట.
అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలపై నిఘా పెరగడం కూడా ఈ మార్పులకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలను పీఈఆర్ఎం ప్రోగ్రామ్ నుంచి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులో ఇది కీలకమైన ప్రక్రియ. కొత్త హెచ్-1బీ వీసా పిటిషన్లపై లక్ష డాలర్ల ఫీజును కూడా ట్రంప్ విధించారు. గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మెుత్తానికి దశాబ్ధాలు అమెరికాలో కన్న కలలు మారిన రూల్స్ వల్ల నీలుకారిపోతున్నాయనే ఆవేదన చాలా మంది టెక్ ఫ్యామిలీలను వెంటాడుతోంది.
