ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, టెక్నాలజీ విస్తరించినప్పటికీ మనుషుల సగటు ఎత్తు క్రమంగా తగ్గిందని కొత్త పరిశోధనలో తేలింది. సమాజంలో సాంకేతిక విజ్ఞానం పెరగడం వల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అనుకున్నా.. అది అందరికీ మేలు చేయలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింగెన్, మ్యాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జియో ఆంత్రోపాలజీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
పరిశోధకులు 45 దేశాలలోని 783 పురావస్తు ప్రదేశాల నుంచి సేకరించిన 18వేల 457 అస్థిపంజరాలను పరీక్షించారు. సుమారు 7 వేల ఏళ్ల నాటి నుంచి సేకరించిన ఈ ఎముకల ఆధారంగా మనుషుల ఎత్తును అంచనా వేశారు. వేల ఏళ్ల క్రితం నాటి మనుషుల ఎత్తును గుర్తించేందుకు తొడ ఎముకను ఉపయోగించారు. మానవ శరీరంలో ఇది పొడవైన ఎముక కావడంతో దీని పొడవు ఆధారంగా మనిషి ఎత్తును అంచనా వేయవచ్చని పరిశోధకులు తెలిపారు. జన్యువులతో పాటు చిన్నతనంలో లభించే పౌష్టికాహారం, వ్యాధులు మనిషి ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జనాభా ఆరోగ్యాన్ని, జీవన పరిస్థితులను అంచనా వేయడానికి సగటు ఎత్తు ఒక మంచి కొలమానమని పరిశోధకులు వివరించారు.
ఆగ్నేయాసియాలో భారీ మార్పు
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆగ్నేయాసియాలో మనుషుల ఎత్తులో భారీ మార్పులు కనిపించాయి. 7 వేల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మగవారి సగటు ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉండేది. కానీ 19వ శతాబ్దం నాటికి ఇది 5 అడుగుల 3 అంగుళాలకు పడిపోయింది. అంటే సుమారు 18 సెంటీమీటర్ల ఎత్తు తగ్గారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సింగపూర్‌లో మగవారి ఎత్తు 173.5 సెంటీమీటర్లు, థాయ్‌లాండ్‌లో 171.6 సెంటీమీటర్లుగా ఉంది. ఇండోనేషియాలో 165.3, ఫిలిప్పీన్స్‌లో 163.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
జనాభా పెరగడం వల్లే మనుషుల ఎత్తు తగ్గి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. వ్యవసాయంలో కొత్త పద్ధతుల వల్ల ఆహార ఉత్పత్తి పెరిగినా, అది పెరిగిన జనాభాకు సరిపోలేదని చెప్పారు. చైనాలో 11వ శతాబ్దంలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు వచ్చినా.. మనుషులకు అందే పోషకాల నాణ్యత పెరగలేదు. ఎక్కువ మందికి ఆహారం దొరికినా.. అందులో ప్రోటీన్ వంటి పోషకాలు తక్కువగా ఉండటంతో అది ఎదుగుదలపై ప్రభావం చూపిందని వివరించారు.
మరోవైపు ఉత్తర ఐరోపాలో మాత్రం మనుషుల ఎత్తు పెరిగింది. అక్కడ డెయిరీ ఫామింగ్ పెరగడం, పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషకాలు లభించాయని పరిశోధకులు తెలిపారు. టెక్నాలజీ వల్ల ఉత్పాదకత పెరిగినా.. అది అందరి జీవన ప్రమాణాలను మెరుగుపరచలేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆహారం, జీవన పరిస్థితులను బట్టి ఎత్తులో మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు చెప్పారు.
