అమితాబ్ బచ్చన్ ఇల్లు, మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు

అమితాబ్ బచ్చన్ ఇల్లు, మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ప్రముఖుల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, ముంబై మేయర్ కార్యాలయానికి గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఆఫీసుతో పాటు మరికొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ ముంబై కన్సర్ట్ వేదిక పైన కూడా దాడి చేస్తామని దుండగులు హెచ్చరించారు.

నవంబర్ 27న మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. 2008 ముంబై ఉగ్రదాడుల 18వ వార్షికోత్సవం రోజే ఈ బెదిరింపులు రావడం గమనార్హం. ముంబై మేయర్ రీతూ తావ్డే, బీఎంసీ కమిషనర్ అశ్వినీ భిడే ఈమెయిల్ ఐడీలకు ఈ సందేశాలు అందాయి. ముంబై మెట్రో రైలు నెట్‌వర్క్‌ను కూడా టార్గెట్ చేస్తామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.

ఈ బెదిరింపుల్లో ఖలిస్థాన్, 1984 సిక్కు వ్యతిరేక హింస గురించి ప్రస్తావించారు. ‘బబ్బర్ ఖల్సా (పర్మార్-కెనడా)’, ‘ఖలిస్థాన్ నేషనల్ ఆర్మీ’ పేర్లను సందేశం పంపిన వారు పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు. నవంబర్ 29న బెంగళూరులోని మాదవరలో ఉన్న నైస్ గ్రౌండ్స్‌లో జరగనున్న దిల్జీత్ దోసాంజ్ కన్సర్ట్‌లో కూడా ఐఈడీ పేలుడు జరుపుతామని రెండు రోజుల ముందే ఒక ఈమెయిల్ వచ్చింది.

ALSO READ : అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ టీమ్..

బాంబు బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. అమితాబ్ నివాసంతో పాటు మేయర్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. మెయిల్ పంపిన గుర్తు తెలియని దుండగుడి గురించి ఆరా తీస్తున్నారు. మెయిల్ పంపింది ఎవరు..? ఎక్కడి నుంచి పంపారు..? అనేది ఆరా తీస్తున్నారు.