ఈ ట్వీట్కు అర్థమేంటి..? ముంబై ఇండియన్స్ చెప్పకనే చెప్పేసిందా..!

ఈ ట్వీట్కు అర్థమేంటి..? ముంబై ఇండియన్స్ చెప్పకనే చెప్పేసిందా..!

ముంబై ఇండియన్స్ కు హార్దిక్ ప్యాండ్యా దూరమయ్యాక.. కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ రోహిత్ శర్మకే అప్పగించే చాన్స్ ఉందనే ఊహాగానాలు చాలా రోజులుగా నడుస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ లేటెస్టుగా చేసిన ఒక ట్వీట్ మాత్రం.. ఆ విషయం చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. 

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్‌లో రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ ఈ ఊహాగానాలకు తెరలేపింది.

2026 నవంబర్ 25న ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ యానిమేటెడ్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అందులో ఒక చేయి ముంబై ఇండియన్స్ క్యాప్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పోస్టుకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఈ ఫొటోను రోహిత్ శర్మ కెప్టెన్సీ రీఎంట్రీకి సంకేతంగా భావిస్తున్నారు.

హార్దిక్ పాండ్యా ఔట్.. రోహిత్‌కు మళ్లీ అవకాశం?

ఐపీఎల్ 2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే తాజాగా ఐపీఎల్ 2027కు ముందు జరిగిన ట్రేడ్‌లో హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా, భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు.

దీంతో ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

 ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన కెప్టెన్

రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందారు. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో మొత్తం ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది.

2024 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంతో రోహిత్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు హార్దిక్ జట్టును వీడటంతో రోహిత్ తిరిగి నాయకత్వ పగ్గాలు చేపడతారనే అంచనాలు పెరిగాయి.

  కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్, తిలక్ వర్మ కూడా !

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు కూడా గతంలో వినిపించాయి. హార్దిక్ అందుబాటులో లేని సమయంలో సూర్యకుమార్ జట్టుకు నాయకత్వం వహించారు. మరోవైపు తిలక్ వర్మను భవిష్యత్తు కెప్టెన్‌గా కూడా పరిగణించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజా పరిణామాల ద్వారా రోహిత్ శర్మకే కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్‌తో మేనేజ్‌మెంట్ చర్చలు జరిపినట్లు కూడా పలు కథనాలు వెల్లడించాయి.

 అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

ముంబై ఇండియన్స్ తాజా సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఫ్రాంచైజీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం ఈ పోస్టును ఆధారంగా చేసుకుని ఆయన కెప్టెన్‌గా నియమితులయ్యారని చెప్పలేం.

డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ ఎవరనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోహిత్ మళ్లీ కెప్టెన్‌గా వస్తే ముంబై అభిమానులకు అది పెద్ద సంతోషకరమైన వార్తే కానుంది.