హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కార్ పూలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు టీ హబ్ లో సైబరాబాద్ మూవ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది టీజీఎస్ఆర్టీసీ. ఇందుకోసం సిటీలోని వివిధ ఏరియాల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు, అరగంటకు తీ హబ్ కు బస్సులు నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ.
ఈ ప్రత్యేక బస్సులు రాయదుర్గం నుండి టీహబ్ వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. అదేవిధంగా మెహదీపట్నం నుండి టీహబ్ వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు, సికింద్రాబాద్ నుండి టీహబ్ వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడపనున్నట్లు తెలిపింది. టీహబ్ లో జరిగే "సైబరాబాద్ మూవ్స్' కార్యక్రమానికి వెళ్ళేవాళ్లు ఈ బస్సులను ఉపయోగించుకోవాలని కోరింది టీజీఎస్ఆర్టీసీ.
ఇదిలా ఉండగా.. సైబరాబాద్లో ఉండే వారు, జాబ్స్చేసేవాళ్లు..ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోయేవారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్. పిల్లలను స్కూల్లో దింపేందుకు, తీసుకువచ్చేందుకు కార్లను వాడే తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. తాము సైకిళ్లపై వచ్చేవారికి ప్రత్యేక రూట్ క్రియేట్చేయడంతో పాటు సురక్షిత ప్రయాణంతో పాటు ఆటంకం లేని రాకపోకలకు వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పోలీసుల వద్ద ఉన్న సమాచారం, సీసీటీవీ కెమెరాలు, వాహనాల లెక్కలు తీసి ప్రతి రూట్లో గతంలో ఉన్న రద్దీ..ఈ మూడు రోజులతో పోల్చి, రద్దీ లేని రహదారులను ప్రత్యక్షంగా చూపిస్తామని వెల్లడించారు.
