కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ కు ఇమిగ్రేషన్ అధికారులు షాకిచ్చారు. విదేశాలకు వెళ్లకుండా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాస్ పోర్టును వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. లండన్ వెళ్లేందుకు 2026 నవంబర్ 2న తెల్లవారుజామున ఎయిర్ పోర్టుకు వెళ్లిన తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు సౌరవ్ పేర్కొన్నారు.
చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సౌరవ్ దాస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పుట్టిన స్థలం వివరాలపై ఏడు రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం (నవంబర్25) ఈ వివరాలను వెల్లడించారు. తన వివరణ ఇచ్చే వరకు పాస్‌పోర్ట్‌ను వాడకూడదని సౌరవ్ దాస్‌కు అధికారులు సూచించినట్లు చెప్పారు.
దర్యాప్తు సంస్థల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నవంబర్ 23న ఈ నోటీసు ఇచ్చామని రణధీర్ జైస్వాల్ తెలిపారు. సౌరవ్ దాస్ తన పుట్టిన స్థలం విషయంలో ఇచ్చిన సమాచారంలో తేడాలు ఉన్నాయని, వాటిపై వివరణ ఇచ్చే అవకాశం ఆయనకు కల్పించామని పేర్కొన్నారు. అయితే ఆ తేడాలు ఏమిటనేది ఆయన వెల్లడించలేదు.
లండన్ వెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున 1 గంటకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని సౌరవ్ దాస్ ఆరోపించారు. తన పాస్‌పోర్ట్‌ను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారని ఆయన పీటీఐకి తెలిపారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎల్ఎస్ఈ, ఎడిన్బర్గ్ వంటి యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు తనను ఆహ్వానించారని సౌరవ్ దాస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తన ప్రయాణాన్ని అడ్డుకుందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఈ ఘటనపై సౌరవ్ దాస్ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు ఎలాంటి ఉత్తర్వులు అధికారులు చూపలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నవంబర్ 27న కూడా బ్రిటన్ వెళ్లే అవకాశం ఉందని, పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మలతో కూడిన ధర్మాసనం విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఆహ్వానం మేరకు తాను వెళ్తున్నానని సౌరవ్ దాస్ చెప్పారు.
