భక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అలాంటిదే బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టించిన చిత్రం 'హనుమాన్ అంశ్'. నీమ్ కరోలి బాబా జీవిత విశేషాల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ భక్తిరస చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 27 నుంచి హిందీ భాషలో మాత్రంమే సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 29 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గుజరాతీ భాషల్లో నెట్ ప్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సినిమాలో నీమ్ కరోలి బాబా పాత్ర పోషించిన నటుడు శోభినవ్ సత్య ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన నటనా ప్రయాణం గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు శోభినవ్ సత్య . నిజానికి తాను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి వచ్చానని, అనూహ్యంగా హీరోగా మారాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ప్రధాన నటుడు అనారోగ్యానికి గురవడం, దర్శకుడు ఆందోళనలో ఉండటంతో సినిమా ఆగిపోకూడదనే ఉద్దేశంతో నీమ్ కరోలి బాబా పాత్రను అంగీకరించానన్నారు. ఇది తనకు హనుమంతుడి ఆశీర్వాదంగా భావించానని చెప్పారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ సినిమాలోని పాటకు కారులో కూర్చుని ఆస్వాదించిన వీడియో అప్పట్లో వైరల్ కావడం గురించి కూడా శోభినవ్ సత్య స్పందించారు. ఢిల్లీలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఆ కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయానని, కారులోనే మొబైల్ ద్వారా లైవ్ చూశానని తెలిపారు. మోదీని కూడా ఒక సాధువులా భావిస్తానని, ఆయన స్పందన తనకు ఎంతో గర్వంగా అనిపించిందని చెప్పారు.
సినిమా నిర్మాతల మధ్య విభేదాలున్నాయనే ప్రచారంపైనా స్పందిస్తూ.. తమ టీమ్‌లో ఎలాంటి గొడవలు లేవని, అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. సినిమా విజయవంతమవుతున్నప్పుడు కొన్ని ప్రతికూల ప్రచారాలు సహజమని శోభినవ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు 'హనుమాన్ అంశ్' సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రెండో భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదని, త్వరలో దర్శకుడు అధికారిక ప్రకటన చేస్తారని వెల్లడించారు.
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. థియేటర్లలో భక్తి భావాన్ని పంచిన 'హనుమాన్ అంశ్' డిజిటల్ వేదికపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో మరి...
