హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల హవా.. ప్రపంచ స్థాయికి టెక్నాలజీతో మల్టీప్లెక్స్‌లకు షాక్!

హైదరాబాద్‌లో  సింగిల్ స్క్రీన్ థియేటర్ల హవా..  ప్రపంచ స్థాయికి టెక్నాలజీతో మల్టీప్లెక్స్‌లకు షాక్!

ఒకప్పుడు సినిమా చూడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లే ప్రేక్షకులకు ప్రధాన వినోద క్రేందాలు. ఆ తర్వాత మల్టీప్లెక్స్ లు, భారీ స్క్రీన్లు, ఓటీటీలు రావడంతో వాటికి క్రమేనా ఆదరణ తగ్గింది. పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని మూతపడగా.. మరికొన్ని మనుగడ కోసం పోరాడుతున్నాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. పాత సింగిల్ స్క్రీన్లే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మల్టీప్లెక్స్ లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. లేటెస్ట్ గా మియాపూర్‌లోని సాయి రంగ 70ఎంఎం థియేటర్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
 
తెలంగాణలోనే తొలి థియేటర్.. 

సాయి రంగ 70ఎంఎం థియేటర్ ప్రతిష్ఠాత్మక 'ఇన్ఫినిటీ విజన్' సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. ఈ గుర్తింపు పొందిన తెలంగాణలో తొలి సింగిల్ స్క్రీన్ థియేటర్‌గా నిలిచింది. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ప్రారంభించిన ఈ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) సర్టిఫికేషన్ సాధించడం అంత సులభం కాదు. కనీసం 45 అడుగుల వెడల్పైన భారీ స్క్రీన్, 2K లేదా అంతకంటే మెరుగైన లేజర్ ప్రొజెక్షన్, నిర్దేశిత బ్రైట్‌నెస్ ప్రమాణాలు, డాల్బీ అట్మాస్ లేదా 7.1 సరౌండ్ సౌండ్ వంటి ప్రమాణాలను అందుకోవాలి. అంటే ప్రేక్షకులకు మరింత స్పష్టమైన విజువల్స్, అద్భుతమైన సౌండ్ అనుభూతి అందించడమే లక్ష్యం.

సింగిల్ స్క్రీన్లలో సరికొత్త పోటీ...

ఇప్పటికే ప్రసాద్స్ మల్టీప్లెక్స్, అపర్ణ సినిమాస్ వంటి ప్రీమియం వేదికలతో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సాయి రంగ వంటి సింగిల్ స్క్రీన్లు కూడా అదే స్థాయి అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. సుదర్శన్, దేవి, సంధ్య, భ్రమరాంబ, మల్లికార్జున, శ్రీరాములు వంటి థియేటర్లు సైతం ఆధునిక హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 భారీ అంచనాలు..

బాలానగర్‌లోని విమల్ థియేటర్ 70 అడుగుల భారీ స్క్రీన్, సౌకర్యవంతమైన సీటింగ్, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్‌తో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌లోని శివగంగ థియేటర్‌ను డాల్బీ సినిమా ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే ప్రపంచంలోనే డాల్బీ సినిమా టెక్నాలజీతో కూడిన తొలి సింగిల్ స్క్రీన్ థియేటర్‌గా నిలిచే అవకాశం ఉందనే అంచనాలున్నాయి...

ఓటీటీలు, మల్టీప్లెక్స్‌ల పోటీని తట్టుకుంటూ హైదరాబాద్ సింగిల్ స్క్రీన్లు మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇకపై హైదరాబాద్‌ వాసులు సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్‌లకే వెళ్లాల్సిన అవసరం లేదేమో..