రోడ్డుపై బైక్, కారు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇష్టారీతిన చెలాన్లు పడుతున్నా లైట్ తీసుకుంటున్నారా? అయితే ఇకపై మీ జేబుకు గట్టిగానే చిల్లు పడబోతోంది. ఇప్పటివరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు కేవలం జరిమానా కడితే సరిపోయేది. కానీ త్వరలోనే మీ వాహనంపై ఉన్న పాత చెలాన్ల ఆధారంగా మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం మన దేశంలో రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో దాదాపు 19 శాతం వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోవడంతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. గత ఏడాది కాలంలో ఒక్కో వాహనంపై నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, చెలాన్ల రికార్డును ఇన్సూరెన్స్ ప్రీమియంతో అనుసంధానించే కొత్త విధానంపై మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే.. తరచూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే కారు, బైక్ యజమానులు తమ వాహన ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో సాధారణం కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందట. దీనితో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు సహా కొన్ని ప్రత్యేక కేటగిరీల బేస్ ఇన్సూరెన్స్ రేట్లను కూడా సవరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల యాక్టివ్ వాహనాల్లో 81 శాతం వాటికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. ఇందులో కార్లకు 88 శాతం, భారీ వాహనాలకు 90 శాతానికి పైగా ఇన్సూరెన్స్ పాలసీలు ఉండగా.. బైకుల్లో 80 శాతం మాత్రమే కవరేజ్ కలిగి ఉన్నాయి. మిగిలిన 19 శాతం వాహనాలను కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి కావడంతో కేంద్రం ఈ కొత్త ప్రతిపాదనలు తెస్తోంది.
ALSO READ : ఇక టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పనిలేదు.. FASTag ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే !
ఇన్సూరెన్స్ లేని వాహనాలకు చెక్ పెట్టేందుకు ''నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్'' విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మకుండా పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని రవాణా, పెట్రోలియం శాఖలకు సూచనలు అందాయి. అంతేకాకుండా వాహనదారుల సౌలభ్యం కోసం కార్లకు 4 ఏళ్లు, బైకులకు 6 ఏళ్ల కాలపరిమితితో ఒకేసారి ప్రీమియం చెల్లించే మల్టీ-ఇయర్ పాలసీలను తీసుకురావడంపైనా మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మెుత్తానికి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చలానాలతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలోనూ భారం పడనుందని ప్రజలు గమనించాలి ఇకపై.
