రోబోల యుగం వచ్చేసిందా?..ఎలన్ మస్క్ సూట్‌కేసులు మోస్తున్న రోబో వైరల్

రోబోల యుగం వచ్చేసిందా?..ఎలన్ మస్క్ సూట్‌కేసులు మోస్తున్న రోబో వైరల్

రోబో ప్రపంచం రాబోతుంది అనటానికి ఇదే సంకేతం.. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీల్లో రోబోలు పని చేస్తున్నాయి. ఇప్పుడు మనుషులకు హెల్ప్ చేయటానికి రోబోలు వచ్చేశాయి. హ్యూమన్ రోబోలు రావటానికి ఎంతో కాలం లేదు అనుకోవటం కాదు.. ఆల్ రెడీ వచ్చేశాయ్ అనటానికి ఇదే నిదర్శనం. ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విమానం నుంచి ఎలన్ మస్క్ దిగి వస్తుండగా.. అతని వెనక.. అతని సూట్ కేసులు మోస్తూ వస్తున్న రోబో వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలన్ మస్క్ సూట్‌కేసులను ఓ హ్యూమనాయిడ్ రోబో మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. రోబోల భవిష్యత్తు, మానవ ఉపాధిపై వాటి ప్రభావం గురించి యూజర్లు చర్చించుకుంటున్నారు. మస్క్ తన ప్రైవేట్ జెట్ నుంచి దిగుతుండగా, రోబో రెండు సూట్‌కేసులను మోసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఇది టెస్లా తయారు చేసిన ‘ఆప్టిమస్’ రోబో అని భావిస్తున్నారు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా నవంబర్ 24న ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు. రోబోలు కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం కాకుండా రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మార్పుతో అపారమైన అవకాశాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయని ఆయన చెబుతున్నారు. రోబోల రాక వల్ల ఆర్థిక, సామాజిక పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై నెట్టింట భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ : AIకి ట్రైనింగ్ ఆపండి.. కంట్రోల్ చేయలేకపోతున్నాం

ఆటోమేషన్ వల్ల లాభాలు ఉంటాయని కొందరు చెబితే, ఉపాధి పోతుందనే ఆందోళనను మరికొందరు వ్యక్తం చేశారు. జపాన్ వంటి దేశాల్లో రెస్టారెంట్లలో రోబోలను ప్రయోగాత్మకంగా వాడుతున్నారని ఓ యూజర్ గుర్తు చేయగా భారత్ లాంటి దేశాల్లో కార్మికులు ఎక్కువగా ఉన్నారని, ఇలాంటి టెక్నాలజీ వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోబోలకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. యంత్రాలకు కూడా కొన్ని పరిమితులు ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రైల్వే పోర్టర్ల వంటి కార్మికులపై దీని ప్రభావం పడుతుందని యూజర్లు చెబుతున్నారు.