టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతమైంది. తమ మధ్య ఉన్న వివాదం సమసిపోయిందని జెట్టి వెంకటేశ్వరరావు వీడియో విడుదల చేశారు. కొంతమంది కావాలనే అపార్థాలు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని వీడియోలో చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్‌తో తన స్నేహం, అనుబంధం గతంలో లానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌ను దోషిగా తేల్చిన ఒంగోలు న్యాయస్థానం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, అలాగే బాధితుడికి సంబంధించిన కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.
ప్రకాశం జిల్లాకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో జరిగిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ గతంలో రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే, జానకిరామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లు ఆ బకాయిని వసూలు చేసే బాధ్యత తీసుకున్నారు. అప్పు తీర్చే క్రమంలో బండ్ల గణేశ్ రూ.95 లక్షల విలువైన చెక్కును వెంకటేశ్వర్లుకు అందజేశారు.
సదరు చెక్కును బాధితుడు బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. తన డబ్బు కోసం ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత కొన్నేళ్లుగా ఒంగోలు కోర్టులో ఈ కేసుపై విచారణ సాగుతోంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, చెక్ బౌన్స్ అయినట్లు నిర్ధారించి బండ్ల గణేశ్‌కు శిక్ష ఖరారు చేసింది.
నిబంధనల ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు, బాకీ ఉన్న రూ.95 లక్షలను జరిమానా రూపంలో చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పుడు స్వయంగా జెట్టి వెంకటేశ్వరరావు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. వివాదం సమసిపోయిందని ప్రకటించడంతో బండ్ల గణేష్‌కు ఊరట దక్కింది.
