భూమి ఉన్నా లేకున్నా ఇందిరమ్మ కుటుంబ బీమా: మంత్రి వివేక్ వెంకటస్వామి

భూమి ఉన్నా లేకున్నా ఇందిరమ్మ కుటుంబ బీమా:   మంత్రి వివేక్  వెంకటస్వామి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని మంచిర్యాల జిల్లాలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 2026 నవంబర్ 24న ప్రారంభించారు.     చెన్నూరు మండలం గంగారం గ్రామంలో ప్రారంభించిన మంత్రి.. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 

పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిందని మంత్రి వివేక్ అన్నారు.  ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఈ బీమా పథకం కొండంత అండగా నిలుస్తుందని చెప్పారు. 

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక ఎంపీడీవో అజ్మత్ అలీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ లు అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గత కాంగ్రెస్ హయంలో  పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇండ్లు, భూములు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 40 లక్షల మందికే రైతు బీమా ఉండేది. 
కానీ ఇప్పుడు కోటి మందికి పైగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి.

భూమి ఉంటేనే గతంలో ఇన్సూరెన్స్ వచ్చేది కానీ ఇప్పుడు ప్రతి అర్హులకు, ప్రతి కుటుంబానికి భీమా సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. గంగారం గ్రామానికి అడిగిన వెంటనే 25 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో చెన్నూరు లో బస్ డిపో, వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. 

మహిళలకు ఫ్రీ బస్ కోసం ప్రభుత్వం 9వేల కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. సన్న బియ్యం కోసం 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహార పథకాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. గంగారం గ్రామానికి సుమారు 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 

250 కోట్ల రూపాయల నిధులతో సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పుష్కరాల కోసం 70 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.