- ప్రతి 15 రోజులకోసారి మీటింగ్, రోడ్డు భద్రతపై రివ్యూ
- హైవేలపై ప్రతి 75 కిలోమీటర్లకు ఒక ట్రక్ లే- బే ఏర్పాటు
మంచిర్యాల, వెలుగు: నేషనల్, స్టేట్హైవేలపై పెరుగుతున్న యాక్సిడెంట్లను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో రోడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయడంతో పాటు పలు గైడ్లైన్స్జారీ చేసింది. ఈ మేరకు జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్, కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం సంబంధిత శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌లో ఆర్డీవో, ఏసీపీ, డీటీవో నామినేట్ చేసిన ఎంవీఐ, ఆర్అండ్బీ డీఈఈ, ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్‌తో పాటు సంబంధిత హైవే ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై ప్రమాదాల నివారణ చర్యలను సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
- హైవేలపై హెవీ వెహికల్స్ క్యారేజ్‌వే, పేవ్డ్ షోల్డర్లపై పార్కింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి 75 కిలోమీటర్లకు ఒక ట్రక్ లే-బే ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రెస్ట్ రూమ్‌లు, ఫుడ్, సురక్షిత పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు కల్పిస్తారు. వాహనదారులకు 500 మీటర్ల దూరం నుంచే కనిపించేలా రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు.
- – ఎన్ హెచ్లపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హైవే పెట్రోలింగ్ వెహికల్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. స్పీడ్ గన్స్, నిఘా కెమెరాలు, పోలీసు శాఖతో అనుసంధానమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ వాహనాలను 30 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురాన్నున్నారు. అడ్వాన్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) ద్వారా రియల్ టైమ్ అలర్టులు, జీపీఎస్, టైమ్ స్టాంప్ ఫొటోల ఆధారంగా పర్యవేక్షణ చేపడతారు.
- యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి హైమాస్ట్ లైట్లు, ఎల్ఈడీ లైటింగ్, స్పీడ్ ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలు, రిఫ్లెక్టివ్ బోర్డులు, రోడ్డు మార్కింగులు ఏర్పాటు చేయనున్నారు. హైవేల పక్కన ఉన్న అక్రమ దాబాలు, దుకాణాల తొలగింపుతో పాటు బీఎల్ఎస్ అంబులెన్సులు, రికవరీ క్రేన్లను అందుబాటులో ఉంచుతారు.
- డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై జరిమానాలు విధించడంతో పాటు నిబంధనల ప్రకారం లైసెన్సుల రద్దు, సస్పెన్షన్ చర్యలు తీసుకుంటారు. స్కూల్ బస్సుల డ్రైవర్లకు సెలవుల తర్వాత, ముఖ్యంగా సోమవారాల్లో బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తారు. బస్సులకు డీటీవో ద్వారా ఫిట్నెస్ పరీక్షలు చేపట్టి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటినే నడిపేలా చర్యలు తీసుకుంటారు.
- హైవే సేఫ్టీ జోన్లలో కొత్త లైసెన్సులు, ఎన్వోసీలు, ట్రేడ్ అనుమతుల జారీ, పునరుద్ధరణపై ఆంక్షలు విధించనున్నారు. ఇప్పటికే మంజూరైన లైసెన్సులను 30 రోజుల్లోగా సమీక్షిస్తారు. వీధి పశువులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా యానిమల్ క్యాచర్లను నియమించాలని, భవనాల సెల్లార్లను పార్కింగ్‌కే వినియోగించేలా చూడాలని ఆఫీసర్లకు సూచించారు. రోడ్లపై కూరగాయల విక్రయాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లు ఏర్పాటు చేయాలని, హైవే అప్రోచ్ రోడ్లపై అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని ఆదేశించారు.
మంచిర్యాల జిల్లాలో చర్యలు..
ఇందారం బ్రిడ్జి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు లైట్లు, శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్ వద్ద లైట్లు, కలెక్టరేట్ సమీపంలోని ఎన్‌హెచ్63పై స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. బెల్లంపల్లి కాల్ టెక్స్, కన్నాల ఫ్లై ఓవర్ల వద్ద వేగంగా దిగి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మార్కింగులు ఏర్పాటు చేయనున్నారు. మధుర జంక్షన్ వద్ద ప్రస్తుతం ఉన్న టీ జంక్షన్ స్థానంలో వై జంక్షన్, ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-363 ట్రంపెట్ ఇంటర్చేంజ్ వద్ద అకస్మాత్తుగా వచ్చే మలుపుల గురించి వాహనదారులకు తెలిసేలా హెచ్చరిక బోర్డులు అమర్చనున్నారు. లక్సెట్టిపేట బస్టాండ్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, చింతపల్లి వద్ద బతుకమ్మవాగు ప్రాంతంలో రహదారికి ఇరువైపులా సరైన షోల్డర్లు నిర్మాణం చేపట్టనున్నారు.
