గ్రీవెన్స్ లో రైతు ఆత్మహత్యాయత్నం..ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కలకలం

గ్రీవెన్స్ లో రైతు ఆత్మహత్యాయత్నం..ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కలకలం
  •     భూవివాదంలో న్యాయం చేయాలని పురుగుల మందు తాగిన వైనం

ఆదిలాబాద్, వెలుగు: జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. తన భూవివాదంపై అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురైన బోరజ్ మండలం మాండగడకు చెందిన రైతు దేవన్న.. అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు. 

హత్తిఘాట్ శివారులో రైతు దేవన్నకు చెందిన ఐదెకరాల వ్యవసాయ భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు నేపథ్యంలో ఈ భూమికి సంబంధించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్​లోని గ్రీవెన్స్​కు అర్జీ ఇచ్చేందుకు వచ్చిన దేవన్న.. లోపల కలెక్టర్ అర్జీలు స్వీకరిస్తుండగానే, బయట తాను వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి పడిపోయాడు. దీనిని గమనించిన పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాధిత రైతును ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవన్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించి, ధైర్యం చెప్పారు.