చక్కెరకు ప్రత్యామ్నాయంగా స్టీవియా.. రైతులకిది అదనపు ఆదాయ వనరు: దండ రాజిరెడ్డి

చక్కెరకు ప్రత్యామ్నాయంగా స్టీవియా.. రైతులకిది అదనపు ఆదాయ వనరు: దండ రాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: చక్కెరకు సహజ ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో స్టీవియా సాగు అవకాశాలున్నాయని హార్టీకల్చర్​వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్‌‌‌‌లోని హార్టీకల్చర్​కాలేజీలో పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ ఇనిషియేటివ్స్ సొసైటీ (పీఆర్​డీఎస్​ఐఎస్​), గ్లోబల్ స్టీవియా ఫోరం ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌‌‌‌లో జాతీయ స్టీవియా సమిట్‌‌‌‌–2026 నిర్వహించారు.  ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఇక్కడి వాతావరణ పరిస్థితులు స్టీవియా సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

ఏడాదికి నాలుగు విడతలుగా కోతకు వచ్చే ఈ పంటను సరైన మార్కెటింగ్ వ్యవస్థతో సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుందన్నారు. స్టీవియా సాగు, శుద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై రైతులు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం రైతులు, వ్యాపారవేత్తలు, వినియోగదారుల్లో స్టీవియా పంటపై తగినంత అవగాహన లేదని, ఇలాంటి సదస్సుల ద్వారా అవకాశాలను విస్తృతంగా తెలియజేయవచ్చని చెప్పారు.

కొత్త పంటల సాగుకు రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్టీవియా సాగుకు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 5.5 నుంచి 7.5 మధ్య నేల పీహెచ్‌‌‌‌ అనుకూలమని రాజిరెడ్డి తెలిపారు. స్టీవియా సాగును ప్రోత్సహించేందుకు హార్టీకల్చర్​ వర్సిటీ కృషి చేస్తోందన్నారు. అవసరాన్ని బట్టి రాజేంద్రనగర్  హార్టీకల్చర్​ కాలేజీలో స్టీవియా నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు శాస్త్రీయ సాగు పరిజ్ఞానాన్ని అందిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో వర్సిటీ డీన్ డాక్టర్ జె. చీనా, డాక్టర్ టి. సురేష్ కుమార్, డాక్టర్ పి. ప్రశాంత్,    డీన్ డాక్టర్ విజయ కాదర్, స్టీవియా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామనరావు, ప్రముఖ స్టీవియా రైతు వామనరావు తదితరులు పాల్గొన్నారు.