ఫుట్ పాత్ ల ఆక్రమణలపై కార్పొరేషన్లు సైలెన్స్

ఫుట్ పాత్ ల ఆక్రమణలపై కార్పొరేషన్లు సైలెన్స్
  •     కొద్దిరోజులే హడావుడి
  •     జీహెచ్ఎంసీలో ఆపరేషన్ రోప్ బంద్
  •     సీఎంసీ లో వాక్ ఫ్రీ కొనసాగట్లే
  •     ఎంఎంసీలో నూ నో యాక్షన్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : దేశ అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా నగరంలో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల పరిస్థితి మారడం లేదు. దాదాపు అన్ని చోట్లా ఆక్రమణదారులకు అడ్డాలుగా మారిపోయాయి. దీంతో జనం రోడ్ల మీద నడుస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల నుంచి షాపుల ముందు ఏర్పాటు చేసిన సామాన్లు, వెహికిల్స్ పార్కింగ్ తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలతో కుచించికుపోతున్నాయి. కోర్టు గట్టిగా చెప్పినప్పుడే తొలగిస్తూ హడావుడి చేస్తున్న మూడు కార్పొరేషన్లు ప్రస్తుతం సైలెన్స్​అయిపోయాయి. 

కనిపించని ‘రోప్’​

జీహెచ్ఎంసీ పరిధిలో ఫుట్‌‌‌‌పాత్ ఆక్రమణలను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ రోప్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన గ్రేటర్​హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​అధికారులు ఆ తర్వాత వెనక్కి తగ్గారు. మెయిన్​రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై ఆక్రమణలు మళ్లీ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆపరేషన్ రోప్‌‌‌‌ను నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సింది పోయి, కొద్దిరోజుల కార్యక్రమంగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సీఎంసీలో ఫ్రీగా నడవట్లే

సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోనూ ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కొద్ది నెలల క్రితం చేపట్టిన వాక్ ఫ్రీ కార్యక్రమం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. గతనెల వరకు రెగ్యులర్ గా చర్యలు తీసుకున్నప్పటికీ..ఆ తర్వాత ‘వాక్​ఫ్రీ’ని ఆపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై మళ్లీ వ్యాపారాలు, ఇతర ఆక్రమణలు పెరుగుతున్నాయి. 

ఎంఎంసీలోనూ అదే నిర్లక్ష్యం...
ఎంఎంసీ పరిధిలో కూడా ఫుట్‌‌‌‌పాత్ ఆక్రమణలపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఆక్రమణలను తొలగించడంలో చూపిన ఉత్సాహం వాటిని తిరిగి జరగకుండా అడ్డుకోవడంలో కనిపించడం లేదు. అధికారులు ఫుట్​పాత్​లపై ఆక్రమణలు తొలగించడం..మరునాడే అవి మళ్లీ ప్రత్యక్షం కావడం ఇక్కడ సాధారణమైపోయింది. 

నిరంతరం చర్యలు తీసుకోవాలె....

ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల ఆక్రమణల తొలగింపు అనేది కొద్దిరోజులు చేసే కార్యక్రమంలా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్​చేస్తున్నారు. ఒకసారి తొలగించిన తర్వాత పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆక్రమణలు తిరిగి కనిపించినట్టయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 
రోడ్ల విస్తీర్ణంలో10 శాతమే..
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్ల నెట్‌‌‌‌వర్క్ దాదాపు 9,013 కిలోమీటర్లు కాగా, ఐఆర్సీ స్టాండర్డ్స్​ప్రకారం సిటీలో ఉన్న ప్రతి పబ్లిక్ రోడ్డుకు రెండువైపులా కనీసం ఒక వైపైనా ఫుట్‌‌‌‌పాత్ ఉండాలి. ఈ లెక్కన కనీసం 4,000 నుండి 5,000 కిలోమీటర్ల మేర ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు ఉండాలి. మూడు కార్పొరేషన్ల పరిధిలో మెయిన్​రోడ్లు, ఫోర్​లేన్లు కలిపి దాదాపు 800 నుంచి1,045 కిలోమీటర్లు ఉండగా, వీటికి రెండువైపులా వందకు వంద శాతం అంటే 1,600 నుంచి 2,000 కిలోమీటర్ల ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు ఉండాలి. కానీ, అధికారిక లెక్కల ప్రకారమే.. 9,013 కిలోమీటర్లకు కేవలం 850 కిలోమీటర్ల మేర మాత్రమే ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం రోడ్లలో10 శాతం కంటే తక్కువ రోడ్లకు మాత్రమే ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లున్నాయి. ఉన్న 850 కిలోమీటర్ల ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు కూడా చాలా చోట్ల వ్యాపారాలు, అక్రమ కట్టడాలు, పార్కింగ్‌‌‌‌లు, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల వల్ల ఆక్రమణలకు గురయ్యాయి.