- డిశ్చార్జ్ అయిన రోగుల పేరిట బిల్లుల దుర్వినియోగం
- నిమ్స్‌లో అక్రమాల గుట్టువిప్పిన ఏసీబీ
- ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అవినీతి, అక్రమాల బాగోతాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బయటపెట్టింది. మృతి చెందిన రోగుల పేరుతో, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి పేరిట బిల్లులు జనరేట్ చేసినట్లు గుర్తించింది. ముఖ్యంగా ప్రభుత్వ నిధులతో చెల్లింపులు జరిగే ఆరోగ్యశ్రీ రోగులనే లక్ష్యంగా చేసుకుని నిమ్స్‌లో బిల్లుల మాయ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. నిధుల దుర్వియోగం, టెండర్ల అవకతవకలపై టీజీ సేఫ్ (ఫుడ్ సేఫ్టీ), డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖ అధికారులతో కలిసి ఏసీబీ ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో వెలుగుచూసిన అక్రమాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. ఈ వివరాలను ఏసీబీ డీజీ చారుసిన్హా సోమవారం పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
టెండర్ల కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన
ఏసీబీ నివేదిక ప్రకారం.. 2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సర్వీసెస్ టెండర్ల ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించారు. కార్మిక చట్టాలు పట్టించుకోకపోవడంతో పాటు క్యాంటీన్ టెండర్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. టెండర్లలో పోటీని దెబ్బతీసేలా నిమ్స్ అధికారులు బిడ్డర్లతో కుమ్మక్కయ్యారు. ఔట్సోర్సింగ్ సహా వివిధ విభాగాల సిబ్బంది నియామకాల్లోనూ, అన్‌స్కిల్డ్ కార్మికులను సెమీ స్కిల్డ్ కేటగిరీలోకి మార్చడంలోనూ గోల్మాల్ జరిగింది. ఇక ప్రధాన క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా, ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తోంది. గడువు ముగిసిన ఆహార పదార్థాలను సైతం విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
పేషెంట్ మృతి చెందినా కూడా బిల్లుల ప్రాసెస్
ఆపరేషన్ తర్వాత రోగులు డిశ్చార్జ్ అయినా, కొందరు మృతి చెందిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రాసెస్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. కొన్ని కేసుల్లో రోగి చనిపోయిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు సృష్టించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జ్ అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లులు నమోదు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.
రికార్డుల తారుమారు.. బ్యాంకు గ్యారంటీ జప్తులో నిర్లక్ష్యం
సర్జికల్ పరికరాల వినియోగంలోనూ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. అవసరానికి మించి ఎక్కువ పరికరాలు వాడినట్లు రికార్డులు సృష్టించారు. ఒక రోగికి వారంలోనే 800 గ్లౌజులు వాడినట్లుగా తయారు చేసిన రికార్డులను ఏసీబీ సీజ్ చేసింది. ఆరోగ్యశ్రీ రోగుల విషయంలోనే ఈ అవకతవకలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మెడికల్ షాపులు, సెక్యూరిటీ టెండర్లలోనూ అక్రమాలు జరిగాయి. రిజిస్ట్రేషన్ లేని సిబ్బందితో షాపులు నడపడం, సేల్స్ రికార్డులు తారుమారు చేయడం, పాత కాంట్రాక్టులను పదేపదే పొడిగించడం వంటివి గుర్తించారు. డిఫాల్ట్ అయిన ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంకు గ్యారంటీని జప్తు చేయకుండా నిర్లక్ష్యం వహించారని తేల్చారు. ఈ అక్రమాలకు సంబంధించిన నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, కీలక పత్రాలను
ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
ఓటీలలోనే రూ.5 కోట్ల పరికరాలు
నిమ్స్‌లోని ఐదు ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేయగా, సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, వైద్య పరికరాలు, కన్సైన్మెంట్ వస్తువులు థియేటర్లలోనే నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వీటిని ప్రధాన స్టోర్‌కు తరలించకుండా ఓటీలలోనే ఉంచడం వెనుక కుట్ర కోణం ఉందని ఏసీబీ తేల్చింది. సప్లయర్ల నుంచి సర్జికల్ స్టోర్‌కు వెళ్లాల్సిన పరికరాలు, మందులు స్టోర్‌కు వెళ్లకుండానే నేరుగా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది వద్దకు చేరుతున్నట్లు విచారణలో వెల్లడైంది. వినియోగించిన తర్వాత వివరాలను నమోదు చేసి, సప్లయర్ల ఇన్వాయిస్తో బిల్లుల కోసం స్టోర్‌కు పంపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాడని ఇంప్లాంట్లకు కూడా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి బిల్లులు చెల్లించే అవకాశం ఉందని ఏసీబీ హెచ్చరించింది.
