- రెండు బొగ్గు బ్లాక్‌ల కోసం సింగరేణి, జెన్‌కో మధ్యే పోటీ
- మీనాక్షి సెంట్రల్ కోసం 12 సంస్థలతో హోరాహోరీ
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సమీపంలోని కోయగూడెం ఓసీపీ-3 బొగ్గు బ్లాక్‌లపై సింగరేణి సంస్థ ఆశలు పెట్టుకుంది. ఈ రెండు బ్లాక్‌లను దక్కించుకునేందుకు సింగరేణి, తెలంగాణ జెన్‌కో మధ్యే పోటీ ఉండగా, ఒడిశాలోని మీనాక్షి సెంట్రల్ బొగ్గు బ్లాక్ కోసం సింగరేణితోపాటు మరో 12 సంస్థలతో పోటీపడుతోంది. శ్రావణపల్లి, కోయగూడెం ఓసీపీ బ్లాక్‌లకు సింగరేణి, టీజీ జెన్‌కో మాత్రమే సాంకేతిక బిడ్లు దాఖలు చేశాయి. ఇతర కంపెనీలేవీ ఆసక్తి చూపలేదు.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే ఈ గనుల కోసం పోటీపడుతుండటం విశేషం. ఇప్పటికే తాడిచర్ల-2, మణుగూరు పీకేవోసీ-2 డిప్‌సైడ్ బొగ్గు గనులను దక్కించుకున్న సింగరేణి, శ్రావణపల్లి, కోయగూడెం గనులను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. శ్రావణపల్లి బ్లాక్‌లో 33 ఏళ్లపాటు బొగ్గ ఉత్పత్తి చేసేలా సుమారు 119.9 మిలియన్ టన్నుల (11.99 కోట్ల టన్నుల) జీ-10 గ్రేడ్ బొగ్గు నిల్వలున్నాయి. కోయగూడెం ఓసీపీ-3 బ్లాక్‌లో 120 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఈ దక్కితే సింగరేణి మరింత బలోపేతం కావడంతో పాటు దాదాపు 40 ఏళ్లపాటు పర్మినెంటు కార్మికులకు మేలు జరుగుతుంది.
18 బొగ్గు బ్లాక్‌లకు 85 బిడ్లు..
2022లో కేంద్ర ప్రభుత్వం శ్రావణపల్లి, కోయగూడెం ఓసీపీ బ్లాక్‌లకు వేలం నిర్వహించింది. ఇందులో కోయగూడెం ఓసీపీ-3ని ఆరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. అయితే, సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం ఆ టెండర్‌ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 25 బొగ్గు బ్లాక్‌లకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 2026 సెప్టెంబర్ 17న టెండర్లు ఆహ్వానించింది. వీటిలో 18 బ్లాక్‌ల కోసం మొత్తం 85 బిడ్లు దాఖలయ్యాయి. నవంబర్20న బిడ్లను తెరిచారు. బిడ్లను టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలిస్తోంది.
అందుకోసం రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అర్హత సాధించిన సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసి ఆ తర్వాత ఎంఎస్‌టీసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నారు. అత్యధిక బిడ్ వేసిన సంస్థలకు బొగ్గు బ్లాక్‌లను కేటాయిస్తారు. డిసెంబర్ చివరి నాటికి లేదా 2027 జనవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. శ్రావణపల్లి, కోయగూడెం ఓసీపీలతో పాటు ఒడిశాలోని మీనాక్షి సెంట్రల్ బొగ్గు బ్లాక్ కోసం కూడా సింగరేణి టెండర్లు దాఖలు చేసింది. ఇప్పటికే ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థ, మీనాక్షి సెంట్రల్ బ్లాక్‌ను కూడా దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ బ్లాక్ దక్కితే సంస్థకు లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తోంది.
మీనాక్షి సెంట్రల్ కోసం 13 సంస్థల పోటీ..
నైనీ బ్లాక్‌కు దగ్గరలో ఉన్న మీనాక్షి సెంట్రల్ బొగ్గు బ్లాక్‌ను దక్కించుకునేందుకు సింగరేణి టెండర్వేసింది. మీనాక్షి-బి, మీనాక్షి డిప్ ఎక్స్‌టెన్షన్ అనే రెండు గనులను కలిపి మీనాక్షి సెంట్రల్ బ్లాక్‌గా వ్యవహరిస్తారు. అందులో 615 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఈ బ్లాక్ కోసం సింగరేణితో పాటు నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ, జిందాల్, హిందుస్థాన్, కర్ణాటక పవర్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ మైనింగ్, వేదాంత అల్యూమినియం, గ్లోయింగ్ రియాలిటీ, హిందాల్కో, ఎన్‌ఎల్‌సీ, ఒడీసిన్-గ్యాస్, పెన్నా ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు పోటీపడుతున్నాయి. సమ్మిట్ తూర్పు బొగ్గు గనికి అత్యధికంగా 17 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. దయూకప్పిన్, నేరద్ మాలెగావ్ బొగ్గు గనులకు పదేసి బిడ్లు వేశాయి.
సింగరేణి, జెన్‌కో మధ్యే పోటీ..
ఒక్కో గని కోసం రెండు నుంచి 17 కంపెనీలు పోటీపడుతుండగా, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్‌లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌కో మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పీకేవోసీ-2 డిప్‌సైడ్ బొగ్గు గని కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా సింగరేణితోపటు జెన్కోతో టెండర్లు వేయించింది. జెన్‌కో వేలం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది. దీంతో ఆ గని సింగరేణికి దక్కింది. తాజాగా శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్‌ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇదే వ్యూహాన్ని అనుసరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
