కొండెక్కిన కొబ్బరి బోండం..చలికాలంలోనూ తగ్గని ధర

కొండెక్కిన కొబ్బరి బోండం..చలికాలంలోనూ తగ్గని ధర
  • ఒక్కొక్కటి రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయం
  •  దిగుబడి తగ్గడంతో సప్లైపై ఎఫెక్ట్​
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏపీ, తమిళనాడు, కర్ణాటక నుంచి రాక

హైదరాబాద్ సిటీ, వెలుగు: కొబ్బరి బోండాల ధరలు కొండెక్కాయి. వేసవిలో దాహం తీర్చే కొబ్బరి నీళ్లు..  చలికాలంలోనూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్​నగరంలో ఒక్కో బోండం ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. 

కొన్ని ప్రాంతాల్లో పెద్ద సైజు బొండాలకు రూ.80కి పైగా వసూలు చేస్తున్నారు. సాధారణంగా చలికాలంలో డిమాండ్ తగ్గి ధరలు దిగివస్తాయి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొబ్బరి బోండాల దిగుబడి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉభయ గోదావరి జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక నుంచి బోండాలు సరఫరా అవుతున్నాయి.  

ఆయా ప్రాంతాల్లో రైతులు, కాంట్రాక్టర్లు తోటల వద్దే బొండాలను సేకరించి లారీల ద్వారా హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ మార్కెట్లకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి నగరంలోని చిరు వ్యాపారులకు సరఫరా అవుతున్నాయి. ఈ క్రమంలో రవాణా, కూలీల ఖర్చులు, హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ వ్యాపారుల మార్జిన్ కలవడంతో రిటైల్ ధరలు పెరుగుతున్నాయి.

వాతావరణ మార్పులు, తెగుళ్లు

సాధారణంగా నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొబ్బరి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మరోవైపు వాతావరణ మార్పులు(వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, తేమశాతంలో హెచ్చుతగ్గులు), కొబ్బరి తోటల్లో  తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. 

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉద్దానం ప్రాంతంలో తెల్లదోమ తెగులు కారణంగా బోండాల దిగుబడి గణనీయంగా తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి 800 నుంచి 1,000 కాయలు వచ్చే చోట 400 నుంచి 500 కాయలే రావడంతో ధరలపై ప్రభావం పడింది.

వందలాది విక్రయ కేంద్రాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వందలాది కొబ్బరి బోండాల విక్రయ కేంద్రాలు ఉండగా.. వీటి ద్వారా అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. కొందరు సొంతంగా బండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తుండగా, మరికొందరు దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఒక్కో బండి వద్ద రోజుకు దాదాపు 100 నుంచి 200 బోండాలు విక్రయించే వ్యాపారులు కూడా ఉన్నారు. వాటి నిల్వ, వ్యర్థాల తొలగింపు వంటి పనుల్లోనూ పలువురికి ఉపాధి లభిస్తోంది. 

ఆరోగ్యానికి మేలు.. 

కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ద్రవాలను అందించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఎండలో పనిచేసేవారు, వ్యాయామం చేసేవారు దాహం తీర్చుకోవడానికి కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతారు. సహజమైన పానీయంగా చాలామంది వీటిని తీసుకుంటారు.

 అయితే, ధరలు పెరగడంతో కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. నలుగురు సభ్యులున్న కుటుంబం 4 బోండాలు కొనాలంటే రూ.240 నుంచి రూ.320 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, రోజూ తాగే వారు కూడా ధరలు పెరగడంతో రెండు, మూడు రోజులకోసారి తాగుతున్నామని చెబుతున్నారు.