భోపాల్: మధ్యప్రదేశ్లో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కూతురితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని రూ.10 లక్షల సుపారీ ఇచ్చి ఓ యువకుడిని దారుణంగా హత్య చేయించారు ఆమె తండ్రి, సోదరుడు. మద్యం తాగించి, ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి చంపి.. ఆ తర్వాత హత్యను రోడ్డు ప్రమాదం చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం విషయం బయటపడింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ పరువు హత్యకు సంబంధించి పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.
బాలాఘాట్ జిల్లా హట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని నహర్వానీకి చెందిన 20 ఏళ్ల రియాంష్ చౌహాన్ పొరుగింట్లో ఉండే జీవన్ పట్లే కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. యువతి తండ్రి జీవన్ పట్లే, సోదరుడు అశుతోష్ పట్లేకు ఈ సంబంధం ఏ మాత్రం ఇష్టం లేదు. తన సోదరితో లవ్ అఫైర్ ఆపేయాలని రియాన్ష్తో అశుతోష్ పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు.
రియాన్ష్ మాట వినకపోవడంతో ఎలాగైనా అతన్ని అంతమొందించాలని తండ్రకొడుకులిద్దరూ ప్లాన్ చేశారు. నలుగురు యువకులకు రూ. 10 లక్షలు ఇస్తామని ఆశ చూపి ఈ హత్యకు ఒప్పించారు. ఈ పథకంలో భాగంగా.. నవంబర్ 16వ తేదీ రాత్రి రియాంష్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించి, ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని అతని స్కూటీతో పాటు పరస్వానీ-లోహారా రోడ్డు పక్కన ఒక కల్వర్టు సమీపంలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
