బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? ఈ మూడు బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలు తెలుసుకోండి!

బ్యాంక్ లోన్  తీసుకోవాలనుకుంటున్నారా ? ఈ మూడు బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలు తెలుసుకోండి!

మనకు ఒక్కోసారి అనుకోకుండా డబ్బు అవసరం పడుతుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్లు, ఇంటి  నిర్మాణం లేదా ఇతర అత్యవసర కోసం డబ్బు కావాల్సి రావచ్చు. ఇలాంటి సమయాల్లో చేతిలో సరిపడా డబ్బు లేకపోతే చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటుంటారు.

ప్రస్తుతం బ్యాంకులు కూడా కస్టమర్ల అవసరాలను బట్టి రకరకాల లోన్లు అందిస్తున్నాయి. వీటిలో హోమ్ లోన్స్, వాహన లోన్లు, గోల్డ్  లోన్లు, వ్యాపార లోన్లు, పర్సనల్ లోన్ కామన్.

వీటిలో పర్సనల్ లోన్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ లోన్  తీసుకున్న డబ్బును హాస్పిటల్  ఖర్చులు, పిల్లల చదువు, పెళ్లి ఖర్చులు, ఇంటి నిర్మాణ అవసరాలు వంటి వివిధ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఈ లోన్ తీసుకోవడానికి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే బ్యాంకు నిబంధనలు, అర్హతలు తప్పనిసరిగా వర్తిస్తాయి.

ఇదిలా ఉంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం పెంచిన తర్వాత కొన్ని బ్యాంకులు  పర్సనల్ లోన్ల పై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వారు ఏ బ్యాంకులో వడ్డీ తక్కువగా ఉంది ? నెలకు ఎంత ఈఎంఐ కట్టాలి ? అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి ? అనే విషయాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం పర్సనల్ లోన్లు అందిస్తున్న మూడు బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం....

1. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank)
ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కస్టమర్లకు 9.99 శాతం వడ్డీ రేటుతో పర్సనల్  లోన్లను అందిస్తోంది. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్లు తీసుకోవాలనుకునే వారికి మరో ప్రయోజనం కూడా ఉంది. సాధారణంగా చాలా బ్యాంకులు లోన్లు మంజూరు చేసే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. అలాగే లోన్  గడువు కంటే ముందే పూర్తిగా కట్టి  క్లోజ్ చేసుకోవాలంటే ఫోర్‌క్లోజర్ ఛార్జీలు కూడా విధిస్తాయి. అయితే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పర్సనల్ లోన్లపై ఈ రెండు ఛార్జీలను మాఫీ చేస్తోంది. ఈ బ్యాంకు ద్వారా కనీసం రూ.50  వేల నుంచి గరిష్ఠంగా రూ.1 కోటి వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. లోన్ తిరిగి చెల్లించడానికి 9 నెలల నుంచి 60 నెలల వరకు గడువు ఉంటుంది.

రూ.5 లక్షల లోన్  తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలి?
ఉదాహరణకు, మీరు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకుందాం.... ఈ లోన్ మూడేళ్లలో తిరిగి కట్టెల తీసుకుంటే మీ ప్రతినెల EMI సుమారు రూ.16,131 అవుతుంది. అంటే మీరు ప్రతి నెలా రూ.16,131 చొప్పున 36 నెలల పాటు కట్టాలి. ఇలా మొత్తం మూడేళ్లలో రూ.5,80,716 కట్టాల్సి  ఉంటుంది.ఇందులో మీరు తీసుకున్న అసలు మొత్తం రూ.5 లక్షలు కాగా, మిగిలిన రూ.80,716 వడ్డీ రూపంలో కట్టాల్సి ఉంటుంది. అంటే రూ.5 లక్షల లోన్ తీసుకుంటే మూడేళ్లలో అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.5,80,716 కట్టాల్సి వస్తుంది.

2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా కస్టమర్లకు పర్సనల్ లోన్లు అందిస్తోంది. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు 10 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎస్‌బీఐలో కనీసం రూ.1 లక్ష నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.

లోన్ తీసుకున్న మొత్తాన్ని తిరిగి కట్టడానికి  కనీసం 6 నెలల నుంచి గరిష్ఠంగా 84 నెలల వరకు గడువు ఉంటుంది. అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లోన్ ఎంత కాలంలో తిరిగి కట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే బ్యాంకు అర్హతలు, నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఎస్‌బీఐలో లోన్ తీసుకునేటప్పుడు వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ బ్యాంకు పర్సనల్  లోన్ పై 1.50 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీని కూడా వసూలు చేస్తుంది.

రూ.5 లక్షల రుణం తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలి?
ఉదాహరణకు, మీరు ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుని, ఐదేళ్లలో తిరిగి కట్టాలని  అనుకుంటే నెలకు రూ.10,624 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెలా రూ.10,624 చొప్పున 60 నెలల పాటు కట్టాలి. ఈ విధంగా ఐదేళ్లలో మీరు మొత్తం రూ.6,37,411 కట్టాల్సి వస్తుంది. ఇందులో అసలు మొత్తం రూ.5 లక్షలు కాగా, వడ్డీ కింద రూ.1,37,411 కట్టాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడితో మీ ఖర్చు పూర్తయినట్లు కాదు. లోన్  తీసుకునే సమయంలో 1.50 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దానిపై జీఎస్టీని కూడా అదనంగా చెల్లించాలి. కాబట్టి రుణం తీసుకునే ముందు ఈ ఛార్జీల వివరాలను కూడా తెలుసుకోవాలి.

3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
ప్రభుత్వ రంగానికి చెందిన మరో ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB). ఈ బ్యాంకు కూడా కస్టమర్లకు పర్సనల్ లోన్లను అందిస్తోంది. పీఎన్‌బీలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 10.50 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే లోన్ తీసుకునే వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగం, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను బట్టి వడ్డీ రేటు మారవచ్చు. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజు కింద 1 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా డాక్యుమెంటేషన్ ఛార్జీలు కూడా ఉండవచ్చు.

రూ.5 లక్షల రుణం తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలి?
ఉదాహరణకు, మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుని, ఐదేళ్లకి నెలకు సుమారు రూ.10,746.95 ఈఎంఐ  కట్టాల్సి ఉంటుంది. అంటే 60 నెలల పాటు ప్రతి నెలా ఈ మొత్తాన్ని కట్టాలి. ఈ విధంగా ఐదేళ్లలో మీరు మొత్తం రూ.6,44,817.01 కట్టాల్సి వస్తుంది. ఇందులో మీరు తీసుకున్న అసలు లోన్ రూ.5 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ.1,44,817.01 కట్టాల్సి ఉంటుంది. అయితే వడ్డీతో పాటు లోన్ తీసుకునే సమయంలో 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!
పర్సనల్ లోన్  తీసుకోవాలని అనుకునేవారు కేవలం బ్యాంకు ప్రకటించే వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదు. వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, లోన్ తిరిగి కట్టే గడువు వంటి అంశాలను కూడా పరిశీలించాలి.

ముఖ్యంగా వడ్డీ రేటు,  ప్రతినెల ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, తిరిగి కట్టే గడువు వంటి  ఈ విషయాలు గుర్తుంచుకోండి. మొత్తానికి, పర్సనల్ లోన్ తీసుకునే ముందు కనీసం రెండు, మూడు బ్యాంకుల వడ్డీ రేట్లు, ఈఎంఐలు, ఇతర ఛార్జీలను పోల్చి చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది.