హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న రెండో ఎడిషన్ ‘భారత్ సమ్మిట్ – ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్’ సదస్సులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ – యూత్ అండ్ స్పోర్ట్స్’ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, క్రీడల ప్రాధాన్యత వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ లెక్కన 12 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉందన్నారు. పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం కంటే యువతకు నిజంగా ఉద్యోగాలు కల్పించడం ముఖ్యమని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చదువుకు, ఉద్యోగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. విద్యార్థులు చదువు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగాలు పొందేలా అవసరమైన స్కిల్స్ నేర్పిస్తున్నామని తెలిపారు.
తమిళనాడులో ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ఇంజినీర్లను తయారు చేస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు కోసం టాటా సంస్థ సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 120 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో కేంద్రంలో 200 మంది విద్యార్థులకు ఎలక్ట్రిక్ వెహికల్స్, సెన్సార్లు, డిజైనింగ్ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ అవసరమో, విద్యార్థులకు అవే నేర్పిస్తున్నామని చెప్పారు. దీంతో శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ : ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం
అంతేకాకుండా TOMCOM ద్వారా తెలంగాణ యువతను జర్మనీ, జపాన్ వంటి దేశాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థితిలో కాకుండా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మన దేశంలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టేవారు తక్కువగా ఉన్నారని వంశీకృష్ణ అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు KGFA గ్రోత్ ఫండ్ ద్వారా జిల్లా స్థాయిలోనే యువతకు వారి ఆలోచనలకు అనుగుణంగా సీడ్ ఫండింగ్ అందిస్తున్నామని చెప్పారు.
దీనికి ఉదాహరణగా తన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలోని ధర్మపురికి చెందిన ఓ విద్యార్థి ఆవిష్కరణను ప్రస్తావించారు. 11వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి మహిళల భద్రత కోసం షాక్ పెన్ తయారు చేశాడని తెలిపారు. ఇలాంటి కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
చదువు అంటే కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదని, ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్స్ పెంచుకోవడంతో పాటు కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టే ధైర్యాన్ని కూడా విద్యార్థులు పెంచుకోవాలని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.
