టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 14న తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన గిరిబాబు మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసిన పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
నటుడిగా సినీ ప్రస్థానం
గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. సినిమాల్లో నటించాలనే కోరికతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1973లో జగమే మా సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన గిరిబాబు చివరిగా 2023లో విడుదలైన 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించారు. 600లకు పైగా సినిమాల్లో నటించారు. ప్రారంభంలో హీరోగా నటించాలని ఆశించినప్పటికీ, ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రమంగా విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా కూడా రాణించారు.
గుర్తింపు తెచ్చిన సినిమాలు
గిరిబాబు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పలు తరాల అగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన నటించిన ముఖ్యమైన చిత్రాల్లో జగమే మాయ, కురుక్షేత్రం,కరుణామయుడు, దేవతలారా దీవించండి, సింహగర్జన,మెరుపుదాడి, కంచు కాగడా, సింహాసనం,అతడు, గమ్యం,డమరుకం, ఖడ్గం, గీత గోవిందం, శ్రీనివాస కళ్యాణం. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.
►ALSO READ | టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
నిర్మాతగా, దర్శకుడిగా కూడా..
నటుడిగానే కాకుండా గిరిబాబు నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. జయభేరి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి, పసుపు-కుంకుమ వంటి చిత్రాలను నిర్మించారు.రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుతున్నా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. నటనతో పాటు సినిమా నిర్మాణం, దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేశారు.
నటుడు రఘుబాబుకు తండ్రి
గిరిబాబు వారసత్వాన్ని ఆయన కుమారుడు రఘుబాబు కొనసాగిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రఘుబాబు ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. తండ్రి బాటలోనే ఆయన కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన గిరిబాబు సినీ ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. విలన్‌గా భయపెట్టినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించినా, హాస్యంతో నవ్వించినా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.
