అక్టోబర్‌లో పెరిగిన డిజిటల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన మొబైల్స్, లాప్‌టాప్‌ రేట్లు

అక్టోబర్‌లో పెరిగిన డిజిటల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన మొబైల్స్, లాప్‌టాప్‌ రేట్లు

భారత్‌లో డిజిటల్ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి డిజిటల్ ఉత్పత్తుల ధరలు అక్టోబర్ నెలలో భారీగా పెరిగాయి. ఏడాది ప్రారంభంలో తగ్గిన ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు.. ఇప్పుడు వేగంగా పెరగటం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. మెమరీ చిప్స్‌కు డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయి.

మొబైల్ హ్యాండ్‌సెట్ల ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 5.83 శాతంగా ఉండగా, అక్టోబరు నాటికి అది 8.65 శాతానికి చేరుకుంది. అలాగే లాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఉదాహరణకు పెన్ డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌ల ద్రవ్యోల్బణం ఏకంగా 22 శాతానికి పైగా నమోదైంది. అయితే ఇంటర్నెట్ ఖర్చులు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలు మాత్రం చాలా వరకు అదుపులోనే ఉన్నాయి.

ఈ ధరల పెరుగుదల కేవలం ఎలక్ట్రానిక్స్‌కే పరిమితం కాలకండా.. దేశంలోని మొత్తం వినియోగ వస్తువుల బాస్కెట్‌కు విస్తరించింది. అక్టోబరులో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత 6 శాతం గరిష్ట పరిమితిని దాటి 6.09 శాతానికి చేరుకుంది. ట్రాక్ చేసిన 358 వస్తువులలో దాదాపు 296 వస్తువుల ధరలు సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో పెరిగాయి.

ALSO READ : UPI ఛార్జీలపై సందేహాలు.. 

ఆహార పదార్థాల ధరల భారం కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 116 శాతానికి పైగా, వెల్లుల్లి ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. అలాగే విమాన ప్రయాణ చార్జీలు కూడా ఎక్కువయ్యాయి. కేవలం కొన్ని నిత్యావసరాలకే పరిమితం కాకుండా, డిజిటల్ వస్తువులు, ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ధరలు అన్నీ ఒకేసారి పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం ఎక్కువైంది.