లాయర్లు పంపిన ఫేక్ కోర్టు ఆర్డర్ నమ్మి వెబ్‌సైట్లు బ్లాక్ చేసిన అధికారులు..!

లాయర్లు పంపిన ఫేక్ కోర్టు ఆర్డర్ నమ్మి వెబ్‌సైట్లు బ్లాక్ చేసిన అధికారులు..!

ఫేక్ కోర్టు ఉత్తర్వుల ఆధారంగా వందలాది వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన వ్యవహారం ప్రస్తుతం ఇండియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం(PMO) అత్యంత సీరియస్‌గా స్పందించింది. ప్రభుత్వ వ్యవస్థలను మోసగించి, నకిలీ కోర్టు డాక్యుమెంట్లు పంపి ఆన్‌లైన్ బ్లాకింగ్‌ జరగటంపై ప్రధాని మోడీ కార్యాలయం నేరుగా రంగంలోకి దిగింది. ఈ కుంభకోణానికి బాధ్యులెవరనే దానిపై ఆరా తీస్తూ.. టెలికాం శాఖ కార్యదర్శిని తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించడం సంచలనంగా మారింది.

కొలాబా పోలీసులు, కోర్టు రికార్డుల ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు తాము లాయర్లు అంటూ ఫేక్ హైకోర్టు ఉత్తర్వులను టెలికాం శాఖకు ఈమెయిల్ చేశారు. వీటిపై ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే అధికారులు ఏకంగా 129 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించారు. ఆశ్చర్యకరంగా.. ఆ ఫేక్ కోర్టు ఉత్తర్వులపై ఉన్న తప్పుడు లోగోలు, స్టాంపులు, క్యూఆర్ కోడ్‌లను సైతం ప్రభుత్వ అధికారులు గుర్తించలేకపోవటం షాక్ ఇస్తోంది. అంతేకాకుండా ఈ నకిలీ పత్రాలు నెలల తరబడి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లోనే దర్శనమివ్వడం అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రధాని మోడీ కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యటనలో ఉన్న టెలికాం శాఖ కార్యదర్శి అమిత్ అగర్వాల్ టూర్ ను అర్ధాంతరంగా రద్దు చేసి, వెంటనే పీఎంఓ ముందు హాజరై ఈ వైఫల్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశ అత్యున్నత వ్యవస్థలను కొందరు కేటుగాళ్లు నకిలీ పత్రాలతో ఏవిధంగా తప్పుదోవ పట్టించారనే దానిపై ప్రధాని కార్యాలయం తీవ్ర నిఘా పెట్టింది.

ALSO READ : అక్టోబర్‌లో పెరిగిన డిజిటల్ ద్రవ్యోల్బణం.. 

డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ఏఐతో సృష్టించిన నకిలీ కోర్టు తీర్పులు ప్రపంచవ్యాప్తంగా న్యాయమూర్తులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు ఫోర్జరీ, చీటింగ్ కింద క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించగా.. టెలికాం మంత్రిత్వ శాఖ కూడా అంతర్గత విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి భద్రతా లోపాలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు పీఎంఓ సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను వాడుకుని జరుగుతున్న ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్లు జనం నుంచి పెరుగుతున్నాయి. పెద్దపెద్ద పోస్టుల్లో ఉన్న అధికారులు కూడా ఇంత దారుణంగా, అత్యంత నిర్లక్ష్యంగా ఉండటం ఒక ప్రముఖ మీడియా సంస్థ వాటిని గుర్తించి రిపోర్ట్ చేసే వరకూ కూడా అధికారులు పట్టించుకోకపోవటం దేశ ప్రజలను షాక్ కి గురిచేస్తోంది.