పోయిన బంగారు కడియం తిరిగి అప్పగింత.. టీటీడీ విజిలెన్స్‌పై భక్తురాలి ప్రశంసలు

పోయిన బంగారు కడియం తిరిగి అప్పగింత.. టీటీడీ విజిలెన్స్‌పై భక్తురాలి ప్రశంసలు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న బంగారు కడియాన్ని టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు. సుమారు 40 గ్రాముల బరువున్న బంగారు కడియాన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి బాధితురాలికి అప్పగించారు. టీటీడీ సిబ్బంది చొరవపై భక్తురాలు సంతోషం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీపాద రాజ శృతి శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్ద అనుకోకుండా తనకు చెందిన సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని పోగొట్టుకున్నారు. ఆభరణం కనిపించకపోవడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ సిబ్బంది సంబంధిత ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కెమెరాల దృశ్యాల ఆధారంగా బంగారు కడియాన్ని గుర్తించి, దాని యజమాని వివరాలను నిర్ధారించారు. అనంతరం విలువైన ఆభరణాన్ని భక్తురాలు శ్రీపాద రాజ శృతికి సురక్షితంగా తిరిగి అప్పగించారు.పోగొట్టుకున్న బంగారు కడియం తిరిగి లభించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి తన ఆభరణాన్ని గుర్తించి అప్పగించిన టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

భక్తుల రక్షణతో పాటు వారి విలువైన వస్తువుల భద్రతకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పోయిన వస్తువులను గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు.