అమరావతి: రాప్తాడు నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు అతన్ని అనంతపురం నుంచి కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 13 రోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే ఒక తీవ్రమైన, ప్రాణాపాయ పరిస్థితి) సమస్య తలెత్తింది. దీంతో రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం (నవంబర్ 13) అనంతపురం నుంచి కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి హెల్త్ కండీషన్ విషమంగా ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..?
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై హేమంత్ (21) మొద్దులు కోసే రంపం మిషన్‌తో దాడి చేశాడు. నేరుగా స్కూల్లోకి వెళ్లిన నిందితుడు.. తరగతి గదిలోనే పిల్లలందరితో పాటు టీచర్ చూస్తుండగానే ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డాడు.
ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అటాక్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న హేమంత్‌ను పట్టుకునేందుకు వెళ్లగా నిందితుడు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా నిందితుడి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు వైద్యులు ఆపరేషన్ చేశారు. అతని కాళ్లకు శస్త్ర చికిత్స చేసి బుల్లెట్లు తొలగించారు.
