ఉదయాన్నే వేడివేడి ఇడ్లీ, క్రిస్పీ దోశ, గుమగుమలాడే కాఫీతో రోజును ప్రారంభించడం మనలో చాలామందికి అలవాటు. కానీ ఇప్పుడు ఆ రుచి చూడాలంటే జేబుకు మరింత చిల్లు పడక తప్పదు. దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ ధరలను భారీగా పెంచేశాయి. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా హోటల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు హోటల్ తిండి భారంగా మారుతోంది.
పెరిగిన ఇన్పుట్ కాస్ట్..
గడచిన 6 నుంచి 8 నెలల కాలంలో రెస్టారెంట్లకు కావాల్సిన ముడిసరుకుల ధరలు దాదాపు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని పలువురు రెస్టారెంట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలు, పనీర్, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తులతో పాటు కూరగాయలు, నూనెలు, చక్కెర, పప్పు దినుసులు, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన చర్చ్‌గేట్ హాస్పిటాలిటీ వ్యవస్థాపకుడు ప్రణవ్ రుంగ్టా మాట్లాడుతూ.. అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరగడంతో రెస్టారెంట్లపై భారం పడిందని, ఈ భారాన్ని కొంతవరకు వినియోగదారులపై మోపాల్సి వస్తోందని చెప్పారు.
సౌత్ ఇండియన్ టిఫిన్లకు కష్టాలు
ముఖ్యంగా సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీలు, మిల్క్ బేస్డ్ ఐటమ్స్‌లో ఎక్కువగా వాడే నెయ్యి, వెన్న ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత రెండున్నర నెలల్లోనే నెయ్యి, వెన్న ధరలు కిలోకి ఏకంగా రూ.150 వరకు పెరిగాయి. బెంగళూరు ఫేమస్ విద్యార్థి భవన్ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ ఆడిగ మాట్లాడుతూ.. ఈ పెరుగుదల కారణంగా దోశలు, రైస్ ఐటమ్స్, లంచ్ మెనూల ధరలను 5 నుంచి 10 శాతం వరకు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
పాల ధరల పెరుగుదలే అసలు కారణం
దేశవ్యాప్తంగా డెయిరీ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవలే అమూల్ తన పాల ధరలను లీటరుకు రూ. 2-4 వరకు పెంచింది. అమూల్ తాజా లీటరుకు రూ. 2, అమూల్ గోల్డ్ లీటరుకు రూ. 4 చొప్పున ధరలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీ కూడా ఇదే బాటపట్టింది. ఇక కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని పాలను లీటరుకు ఏకంగా రూ. 8, పెరుగు ధరను కిలోకి రూ. 14 చొప్పున పెంచింది. పశువుల మేత, ప్యాకింగ్, ఇంధన ఖర్చులు పెరగడంతో పాల ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిందని డెయిరీ సంస్థలు చెబుతున్నాయి.
కేవలం పాలు, నెయ్యి మాత్రమే కాకుండా బియ్యం, పప్పులు, పంచదార, వంట నూనెలు, కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయని బెంగళూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్య హోళ్ల తెలిపారు. దీనివల్ల మొత్తం నిర్వహణ ఖర్చులు మరో 5-7 శాతం దాకా పెరిగాయని చెప్పారు. ఉదాహరణకు గతంలో రూ.100 ఖర్చయ్యే సాధారణ భోజనం, టిఫిన్ ఇప్పుడు రూ.105 నుంచి రూ.110 వరకు పలుకుతోంది. చిన్న హోటళ్లు, క్యాంటీన్లయితే కూలీల వేతనాలు, అద్దెలు, కరెంట్ బిల్లుల భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
హోటళ్లకు వెళ్లాలంటే భయం..
ధరలు పెంచడం వల్ల రెస్టారెంట్లు తమ ప్రాఫిట్ మార్జిన్లను కొంతవరకు కాపాడుకోగలుగుతున్నప్పటికీ.. సామాన్య ప్రజల జేబులకు మాత్రం ఇది పెద్ద దెబ్బే. నిత్యావసరాల ధరలు ఇప్పటికే పెరిగిపోవడంతో.. హోటళ్లలోనూ రేట్లు పెరగడంతో కుటుంబ బడ్జెట్ తల్లకిందులవుతోంది. పండగ సీజన్లో వ్యాపారం బాగానే సాగినప్పటికీ.. రాబోయే రోజుల్లో ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది చూడాలి. మొత్తానికి మన రోజువారీ కాఫీ, దోశల రుచి ఇకపై కాస్త ఖరీదైన వ్యవహారంగా మారనుంది.
