గ్లోబల్ టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివాదాల నేపథ్యంలో ఆయన తన పదవిని వీడడానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా జెన్సన్ కు ఫోన్ చేశారు. ఈ క్రమంలో తన ఉద్యోగం కోసం పోరాడాలని ట్రంప్ జెన్సన్ హువాంగ్‌కు సూచించినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ, సాంకేతిక వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.
చైనీస్ ప్రభుత్వానికి గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సహా పలు వివాహేతర సంబంధాలు బయటకు రావడంతో హువాంగ్ ఎన్వీడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ స్టీవెన్ ఎ. స్మిత్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను బుధవారమే హువాంగ్‌తో మాట్లాడానని, ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉందని పేర్కొన్నారు. "నేను నిన్న మాట్లాడాను. అతను ప్రస్తుతం నరకం అనుభవిస్తున్నాడు. అయితే ఈ వివాదం వల్ల తన భార్య, కుటుంబం పడుతున్న బాధ గురించే అతను ఎక్కువగా కుంగిపోతున్నాడు" అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు జెన్సన్ హువాంగ్‌తో అఫైర్ ఉన్న మహిళ నిజంగానే చైనా గూఢచారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఆమె గూఢచారి అయితే మాత్రం హువాంగ్ పదవి నుంచి తప్పుకోవడం సరైనదే అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏఐ బూమ్ సమయంలో ఎన్వీడియా చిప్స్ కోసం ట్రంప్, హువాంగ్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతేడాది చివరిలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్వీడియా H200 చిప్స్‌ను చైనాకు అమ్మేందుకు అనుమతించడం ఆ కంపెనీకి పెద్ద విజయంగా నిలిచింది.
ప్రస్తుతం ఈ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. గత 5 రోజుల్లో ఎన్వీడియా షేర్లు 13 శాతానికి పైగా పడిపోయాయి. హువాంగ్ గూఢచారి వివాదం అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ విచారణ జరపాలని ఉభయ పార్టీల సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. ట్రంప్‌కు ఈ విషయం ముందే తెలుసా? అనే అంశంపై డెమొక్రాట్లు విచారణకు పట్టుబడుతున్నారు. ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ హీట్ మధ్య ఎన్వీడియా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
