ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో భారత యువ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈరోజు (2026, నవంబర్ 12, గురువారం) ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం (నవంబర్ 14) జరగనున్న టైటిల్ పోరులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఫ్ఘన్‌కు కళ్లెం:
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు భారీ స్కోరు సాధించలేకపోయారు.
రాయ్‌చందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం:
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వీరిద్దరూ తొలి వికెట్‌కు 117 రన్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్యవీర్ సెహ్వాగ్ నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీ పూర్తి చేసుకుని అవుట్ కాగా, కెప్టెన్ రాయ్‌చందాని దూకుడుగా ఆడి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వీకే వినీత్ కూడా అదే జోరు కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. నూర్ అలీ నియాజీ వేసిన 36.5వ బంతిని వినీత్ భారీ సిక్సర్‌గా మలచడంతో భారత్ 36.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది.
ALSO READ : రేపే భారత్ vs న్యూజిలాండ్ 4వ వన్డే..
పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం:
గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ కుర్రాళ్లకు ఫైనల్ రూపంలో మంచి ఛాన్స్ దక్కింది. ఎల్లుండి (శనివారం, నవంబర్ 14, 2026) జరగనున్న ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో పాక్‌ను ఓడించి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది.
