Idupu Kayitham Teaser: చాగంటి డైలాగ్‌తో ‘ఇడుపు కాయితం’ టీజర్.. పెళ్లి నుంచి విడాకుల వరకు!

Idupu Kayitham Teaser: చాగంటి డైలాగ్‌తో ‘ఇడుపు కాయితం’ టీజర్.. పెళ్లి నుంచి విడాకుల వరకు!

పెళ్లి అంటే రెండు మనసుల కలయిక.. రెండు కుటుంబాల మధ్య కొత్త బంధం. అయితే ఆ బంధంలోనే విడాకుల పత్రం తెరపైకి వస్తే? ఇలాంటి ఆసక్తికరమైన ఆలోచనతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. యంగ్ హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. వైవిధ్యమైన టైటిల్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

చాగంటి డైలాగ్‌తో టీజర్ ఆరంభం..

‘రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది.. అక్కడి నుంచి రామాయణం ముందుకు వెళుతుంది’ అనే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ఈ మాటలతో టీజర్‌ను మొదలైంది. ఈ డైలాగ్‌కు తగ్గట్టుగానే కథలో శ్రీలత పాత్రకు ప్రాధాన్యత ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆ తర్వాత కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు.

పెళ్లి చూపుల నుంచి విడాకుల వరకు!

ఇందులో ప్రియదర్శి శ్రీను పాత్రలో, నాగదుర్గ శ్రీలత పాత్రలో కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ, పరిచయం, పెళ్లి చూపులు, వివాహం వంటి సన్నివేశాలను సరదాగా చూపించారు. పెళ్లి తర్వాత కొత్త జంట జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సరదాలు, కుటుంబంలో జరిగే సంఘటనలు, అనుబంధాలు, అలకలు ఇలా కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చక్కగా మేళవించారు.

అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లితో మొదలైన ఈ కథ చివరకు విడాకుల పత్రం దగ్గరకు చేరడం! పెళ్లి తర్వాత శ్రీను, శ్రీలత మధ్య ఏం జరిగింది? అసలు ఈ జంట విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే ప్రశ్నలను టీజర్ ప్రేక్షకుల ముందుంచింది. టైటిల్‌కు తగ్గట్టుగా కథలోని కీలకమైన మలుపును చివర్లో పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు.

నవ్విస్తూనే ఆలోచింపజేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

ప్రియదర్శి తన సహజమైన కామెడీ టైమింగ్‌తో శ్రీను పాత్రలో ఆకట్టుకుంటుండగా, నాగదుర్గ శ్రీలతగా కనిపించి మెప్పించే ప్రయత్నం చేశారు. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, సహజమైన సంభాషణలు, కుటుంబ నేపథ్యం టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ప్రేమ, పెళ్లి, కుటుంబ బంధాలు, భార్యాభర్తల మధ్య అనుబంధాలు, మనస్పర్థలు వంటి అంశాలను వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

రెండు విభిన్న ప్రపంచాలు.. ఒక ఆత్మీయమైన కథ!

‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ వినగానే చాలామందికి ఆసక్తి కలగడం సహజం. ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం. సాధారణంగా కుటుంబ కథా చిత్రాలకు భిన్నంగా ఈ టైటిల్ పెట్టడం వెనుక ఏదో ప్రత్యేకమైన కథాంశం ఉందనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో పెళ్లి, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన వ్యక్తుల మధ్య సాగే ఆత్మీయమైన కథగా చిత్రబృందం ఈ సినిమాను రూపొందిస్తోంది. అయితే టైటిల్‌కు, కథకు మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటనేది తెరపైనే తెలియాల్సి ఉంది.

డిసెంబర్ 11న థియేటర్లలోకి..

వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై సుకుమార్, తబితా సుకుమార్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బారాత్ బీట్’ పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

టీజర్ చూస్తుంటే ‘ఇడుపు కాయితం’ కేవలం కామెడీ సినిమానే కాకుండా పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితంలో చోటుచేసుకునే సంఘటనలను వినోదంతో పాటు భావోద్వేగాల మేళవింపుతో చూపించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది. మరి శ్రీను, శ్రీలతల కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? విడాకుల పత్రం వెనుక అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే!