హైదరాబాద్: మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ నది ప్రక్షాళన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాదన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు అని.. మిగితా సమయాల్లో అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. భేషజాలు పక్కనబెట్టి మూసీ నది ప్రక్షాళకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో నదీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని.. నదీతోనే నాగరికత ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను నిజాం అభివృద్ధి చేశారని.. మూసీ పరిసరాల్లో ఆనాడు డెవలప్మెంట్ జరిగిందని గుర్తు చేశారు. రాను రాను మూసీ నది కలుషితమైందని.. కాలుష్య కూపంగా మారిందన్నారు.
మూసీ కాలుష్యం నల్లగొండ జిల్లా ప్రజల పాలిట విషంగా మారిందని చెప్పారు. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. నల్లగొండలో పాదయాత్ర సమయంలో మూసీ సమస్యను ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని.. అప్పుడే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. నేను చేసే పని వల్ల కొందరికి కోపం, బాధ కలగవచ్చు.. కానీ అందులో తనకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. కాలుష్య రహిత మంచి నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తన ఆలోచని అని స్పష్టం చేశారు.
రూ.20 కోట్లతో హైడ్రా అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును బుధవారం (నవంబర్ 11) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న 1372 చెరువుల్లో కబ్జాలు, ఆక్రమణలతో 50 శాతం కనుమరుగయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో సిటీలో చిన్నపాటి వర్షానికే వరద నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు, ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. నగరంలో చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయన్నారు.
కబ్జా కోరల నుంచి చెరువులను రక్షించి పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే హైడ్రా పేరిట ఒక ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో భాగంగానే తమ్మిడికుంట చెరువుకు పునరుజ్జీవనం కల్పించామన్నారు. తమ్మిడికుంట పునరుద్ధరణ సమయంలో కొందరికి ఇబ్బంది కలిగి ఉండొచ్చన్నారు. కొందరికి ఇబ్బంది కలిగినా.. తరాలకు మేలు జరుగుతుందని చెరువుల పునరుద్ధరణ చేపట్టామని స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద మనసుతో తమ్మిడికుంటకు రెండు ఎకరాలు ఇచ్చారని తెలిపారు. నాగార్జున నిజమైన హైదరాబాదీ, రియల్‌హీరో అని సీఎం రేవంత్ కొనియాడారు.
