ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ, మాజీ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతిపార్టీ’ (PRP) పేరుతో కొత్త పార్టీ ప్రారంభమైంది. 2026 నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల11 నిమిషాలకు ఆయన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు.
దేశం కోసం.. ధర్మం కోసం అనే లక్ష్యంతో పార్టీని ప్రారంభించినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. జనం కోసం.. జనం హితం కోసం అనే నినాదంతో ప్రజల మధ్య పనిచేస్తామని ప్రకటించారు. కొత్త తరం.. కొత్త ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో పరివర్తన రాజనీతి పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయాలకు నాంది పలకడమే తమ ఉద్దేశమని పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పరివర్తన రాజనీతి పార్టీ పేరులోని మొదటి అక్షరాలతో PRPగా సంక్షిప్త నామాన్ని ఖరారు చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు కొనసాగుతున్న క్రమంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, విధివిధానాలు, సంస్థాగత నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికపై తదుపరి ప్రకటనలు వెలువడాల్సి ఉంది.
జెండా ఇలా ఉంది :
విజయసాయిరెడ్డి పెట్టిన పరివర్తన రాజనీతి పార్టీ జెండా సైతం విడుదల చేశారాయన. జెండా రెండు రంగుల్లో ఉంది. పైన కాషాయం రంగు.. కింద తెలుగు ఉంది. మధ్యలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం తరహాలో ఓ ధర్మ చక్రాన్ని ఉంచారు. ఓవరాల్ గా జెండా చూస్తే దేశం కోసం ధర్మం కోసం అన్న విధంగానే ఉంది. పేరుకు తగ్గట్టుగానే జెండాను రూపొందించారు విజయసాయిరెడ్డి.
