వీళ్లు పిల్లలా లేక పిల్ల రాక్షసులా. చదువుకునే వయసు వాళ్లది. ఇప్పుడిప్పుడే కౌమార ప్రాయం దాటుతున్నారు. వాళ్లు చేసిన పని చూస్తే మాత్రం.. వాళ్ల మెదళ్లు ఇంతలా క్రైమ్ బీజాలతో నిండిపోయాయా...? అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ వార్త చూసిన ఏ తల్లిదండ్రి అయినా ఏం ఆలోచిస్తారు.. తన పిల్లలను ప్రశాంతంగా బడికి పంపే ధైర్యం సరిపోతుందా..? దేశ భవిష్యత్తుకు పునాదులు పడాల్సిన బడులలో క్రిమినల్ మనస్థత్వాలు ఇంతలా పెరిగిపోవడం జీర్ణించుకోవాల్సిన విషయమేనా..? నెల్లూరు జిల్లాలో సాటి విద్యార్థికి సామూహికంగా పురుగుల మందుతు తాపిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
నెల్లూరు జిల్లా సంగంలో దారుణం జరిగింది. రోజూలాగే స్కూల్ కు వెళ్లి వచ్చిన ఓ విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పిల్లాడి పరిస్థితి చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు.. ఏం జరిగింది నాన్నా అని అడిగితే.. తన తోలి విద్యార్థులే తనకు పురుగుల మందు తాగించరాని చెప్పడంతో ఆ పేరెంట్స్ కు గుండె పగిలినంత పనయ్యింది. ఈ వార్త నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది.
వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కండిషన్ సీరియస్ గా ఉండటంతో చెన్నైకి తరలించారు. పిల్లాడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తమ కొడుకు బతకాలని ఆ తల్లిదండ్రులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
ఈ ఘటనకు పాల్పడింది సాటి విద్యార్థులే. అది కూడా ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్. పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్.. ఎప్పుడూ స్టడీస్ మీదనే శ్రద్ధ వహిస్తూ ఉంటుంటారు. కానీ ఈ పిల్లలకు అలాంటి భయాలు, చదువుపై అంత ధ్యాస లేనట్లుంది. చదువుతో మానసిక పరివర్తన పెంచుకోవాల్సింది పోయి క్రిమినల్ బ్రెయన్స్ పెంచుకుంటున్నారు.
మొన్న 3వ తరగతి విద్యార్థి..
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుండటంతో తీవ్ర ఆదోళన కలిగించే అంశం. మొన్నటికి మొన్న మూడవ తరగతి బాలుడు.. నర్సరీ చిన్నారిపై పూలతొట్టి, ఇటుకలతో దాడి చేసిన ఘటన ఇంకా కళ్లముందే కదులుతోంది. హర్యానాలోని సంస్కృతి మోడల్ స్కూల్ లో క్లాస్ లో ఎవరూ లేని సమయంలో ఆ బాలుడు చేసిన రాక్షస దాడిపై దేశం అంతా నివ్వెరపోయి చూసింది.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే జరగడం ఆందోళన కలిగించే అంశం. సాటి విద్యార్థులే మరో విద్యార్థి జీవితాన్ని అంతం చేయాలని చూడటం షాకింగ్ కు గురిచేస్తోంది.
తల్లిదండ్రుల పెంపకంలో లోపమా.. లేక పిల్లలు పెరిగే పద్ధతిలో సమస్యా అనేది ఆలోచించాల్సిన విషయం. స్మార్ట్ ఫోన్లు, గేమ్స్, టీవీ, ఓటీటీ కంటెంట్.. ఇలా ఏ రకంగా అయితేనేంటి.. పిల్లలు నేర్చుకుంటున్నారు.. దాన్ని తమ నిజజీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని వాదించే వాళ్లు కొందరు. సినిమాలు, మీడియా ఒక్కటే కారణం కాదు.. అలాగైతే మంచి స్టోరీల నుంచి కూడా నేర్చుకోవచ్చు కదా అని కొందరి వాన. ఏదైతేనేం.. ఇలాంటి ఘటనలను తలచుకుంటుంటే.. భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళన అయితే ప్రతి పేరెంట్ లో కలుగుతోంది.
