కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. 12 ఏళ్ల బాలికపై హత్యాచార కేసులో పోలీసులు కాల్పుల్లో నిందితుడు మరణించాడు. ఈ ఘటన సోమవారం (నవంబర్ 9) తెల్లవారుజూమున ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నాలుగో ఎన్కౌంటర్ ఇది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో మంగళవారం (నవంబర్ 3) 12 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. రెండు రోజుల తర్వాత కులిక్ నది సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక నగ్న మృతదేహం లభ్యమైంది.
బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలికకు మేనమామ వరుస అయ్యే దిలీప్ రాయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న దిలీప్ రాయ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత పోలీసులకు నిందితుడి ఆచూకీ తెలిసింది.
►ALSO READ | గుడ్డు సొన రంగుకు, పోషకాలకు సంబంధం ఉందా? సైన్స్ చెప్తున్న నిజం ఇదే
బెంగాల్-బీహార్ సరిహద్దు సమీపంలోని పారాపుకూర్లో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసేందుకు వెళ్లగా దిలీప్ రాయ్ పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పుల్లో దిలీప్ రాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని రాయ్‌గంజ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆత్మరక్షణలో భాగంగానే ఎన్ కౌంటర్: సీఎం సువేందు అధికారి
12 ఏళ్ల బాలికపై హత్యాచార కేసులో నిందితుడిని ఎన్ కౌంటర్ చేయడంపై బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై నిందితుడు కాల్పులు జరపడంతోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అత్యాచారం, హత్య, డ్రగ్స్ అక్రమ రవాణా, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు వంటి తీవ్రమైన నేరాల విషయంలో పైఅధికారుల ముందస్తు అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ప్రభుత్వం పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను ఇచ్చిందని చెప్పారు.
మహిళలపై జరిగే దాడులు, ఘోరమైన నేరాల పట్ల తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం పాటిస్తుందని తేల్చిచెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి నేరాలను తేలికగా తీసుకునేవారని అన్నారు. తమ ప్రభుత్వంలో శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.
