మాదాపూర్, గచ్చిబౌలి కేసుల్లో 2024లో అరెస్టు.. బెయిల్ పై వచ్చి మళ్లీ అదే పని

 మాదాపూర్, గచ్చిబౌలి కేసుల్లో 2024లో అరెస్టు.. బెయిల్ పై వచ్చి మళ్లీ అదే పని

తెలంగాణలో అస్సాం డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ ఫోర్స్ పోలీసులు. 60 రోజుల పాటు ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు.. చివరకు కింగ్‌పిన్ భాస్కర్ హజారికాతో పాటు ముఠాను 2026 నవంబర్ 4న అరెస్ట్ చేశారు. 

సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన భాస్కర్.. డ్రగ్స్ వ్యాపారంలో కీలక సూత్రధారిగా మారాడు. ఒడిశా నుంచి భారీగా గంజాయి సేకరించి.. సైబరాబాద్‌లో వినియోగదారులకు సరఫరా చేస్తున్నాడు. సైబరాబాద్ పరిధిలో సుమారు 100 మంది రెగ్యులర్ వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

2024లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన భాస్కర్ హజారికా మళ్లీ అదే దందా చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. అప్పట్లో మాదాపూర్‌లో రెండు, గచ్చిబౌలిలో ఒక డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.  మూడు కేసుల్లోనూ బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నెట్‌వర్క్ విస్తరించుకున్నాడు. ఆగస్టు 27న చౌటుప్పల్‌లో 20.36 కిలోల గంజాయితో ఇద్దరు పట్టుబడటంతో వీళ్ల సీక్రెట్ నెట్‌వర్క్  బయటపడింది.