పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటలు లెక్క: సుప్రీంకోర్టు

పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటలు లెక్క: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఏదైనా కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఈ 24 గంటల కాలవ్యవధి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కాకుండా పోలీసులు అధికారికంగా అరెస్ట్ చూపించినప్పటి నుంచే స్టార్ట్ అవుతోంది. ఈ నిబంధనంపై లేటేస్ట్‎గా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోలీసులు అధికారిక అరెస్ట్ చూపించినప్పటి నుంచి కాకుండా దర్యాప్తు సంస్థలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల కాల పరిమితి నిబంధన మొదలవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ఆర్టికల్ 22(2)లోని అరెస్ట్, నిర్బంధం అనే పదాలు వేర్వేరు కాదని.. ఈ రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం అధికారిక అరెస్ట్‌తో సంబంధం లేకుండా విడిగా నిర్బంధాన్ని గుర్తించదని పేర్కొంది. 24 గంటల టైమ్ పీరియడ్ లెక్కింపులో కేవలం మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళడానికి పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించాలని స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద తనిఖీల సమయంలో చేసే తాత్కాలిక నిర్బంధం, అరెస్ట్ కిందకు రాదంటూ గతంలో ఒరిస్సా, మద్రాస్, కేరళ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు సరికాదని పేర్కొంది.

చట్టంలో తాత్కాలికంగా స్వేచ్ఛను హరించడం అనే భావనే లేదని తెలిపింది. దర్యాప్తు సంస్థలు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అతడిని ఏ రోజు, ఏ సమయానికి అదుపులోకి తీసుకున్నారో మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేయాలని ఆదేశించింది. అదుపులోకి తీసుకుని 24 గంటల గడువు దాటినట్లయితే నిందితుడిని వెంటనే విడుదల చేయాలని సూచించింది. ఒకవేళ 24 గంటల లోపే ప్రవేశపెట్టినప్పటికీ ఆ నిర్బంధ కాలం సహేతుకం కాదని భావిస్తే మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించవచ్చని సూచించింది. 

సుజిత్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పు కాపీలను దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలు, హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌, జుడీషియల్ అకాడమీలకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.