హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలో భూముల రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న అక్రమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొని ఎవరూ నష్టపోవద్దని... చాలా అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
హైదరాబాద్ భూములు, టిడిఆర్ అక్రమ దందాలు తప్ప ముఖ్యమంత్రికి ఏవీ కనిపించటం లేదని.. అయ్యప్ప సొసైటీలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు కవిత. గురుకుల ట్రస్ట్ భూములపై అనేక ఉద్యమాలు చేశామని... అయ్యప్ప సొసైటీలో రిజిస్ట్రేషన్లు ఉండవని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సొసైటీలో 750 అక్రమ నిర్మాణాలు జరిగాయని.. ఖానామెట్ అయ్యప్ప సొసైటీలోనే నారాయణ, చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయని అన్నారు. ఇంత అక్రమాలు జరుగుతుంటే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కవిత. సర్వే నెంబర్ 11/18 నుంచి 11/44 వరకు అక్రమ నిర్మాణాలు జరిగాయని.. ముఖ్యమంత్రి అన్నదమ్ములు దగ్గరుండి పర్మిషన్ లు ఇప్పించి డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఈ దందా ఆపించాలని అన్నారు.
ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నాం..ఖానా మెట్ అయ్యప సొసైటీలో సర్వే చేయాలని డిమాండ్ చేశారు కవిత.. అమిత్ షా హైదరాబాద్ వచ్చి రాజకీయాలు తప్ప ఏం మాట్లాడలేదని.. డిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తే..అమిత్ షా హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారని అన్నారు.
