దీపావళి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మట్టి ప్రమిదలే. మార్కెట్ లోకి ఎన్ని మోడల్స్ వచ్చినా మట్టి ప్రమిదలకే ప్రాధాన్యం ఉంటుంది. దీపావళికి నెల ముందు నుంచే గ్రా మాల్లో కుమ్మరివాళ్లు ప్రమిదల తయారీ మెదలు పెడతారు. వీటిని తయారు చేయడం సులువైన పని కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది.
కుమ్మరివాళ్లు ముందుగా చెరువు నుంచి మేలు రకమైన మట్టి తీసుకొస్తారు. దాన్ని ఎండబెట్టి పొడి చేస్తారు. ఎండిన తర్వాత అందులో నుంచి రాళ్లు, వ్యర్థాలు తీసేస్తారు. ఇంకా చిన్న చిన్నరాళ్లు తొలగించేందుకు మట్టిలో నీళ్లు కలిపి జల్లెడ పడతారు. ఆ మట్టిని కలియ తొక్కి కాస్త గట్టిగా మారిన తర్వాత కుమ్మరి చక్రం మీద పెట్టి తిప్పుతారు.
చక్రం మీద పెట్టిన మట్టిని ప్రమిదగా మార్చాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. అలా పచ్చిమట్టితో తయారు చేసిన ప్రమిదలను గట్టి పడేవరకు ఎండబెడతారు. తర్వాత వాములో పెట్టి కాలుస్తారు. ఆ పైన వాటిని మార్కెట్ కు తరలించి అమ్ముతారు. పండగ పూట మన ఇళ్లలో విరజిమ్మే వెలుగుల వెనక ఎంతో కష్టం దాగుంటుంది..
