- హైకోర్టును ఆశ్రయించిన మహిళా శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్
హైదరాబాద్/ జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలకు చెందిన కాసరపు సరిత, శ్రీనివాస్ దంపతుల నుంచి స్వాధీనం చేసుకున్న దత్త పుత్రుడిని స్వాధీనం చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ మహిళా శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, సీడబ్ల్యూసీ ఆఫీసర్లు హైకోర్టును ఆశ్రయించారు.
చట్టబద్ధంగా తల్లిదండ్రుల నుంచి 2023లో దత్తత తీసుకున్న బాలుడిని శిశు సంరక్షణ ఆఫీసర్లు బలవంతంగా తీసుకెళ్లాడాన్ని సవాలు చేస్తూ సరిత దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం తరఫున హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
చట్టబద్ధంగా దత్తత జరగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేదని అప్పీలులో పేర్కొన్నారు. ఈ అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టగా ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
