కరీంనగర్ డీఎస్వో ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు..సీఎంఆర్ కేటాయింపులపై ఆరా

కరీంనగర్ డీఎస్వో ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు..సీఎంఆర్ కేటాయింపులపై ఆరా

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్ లోని డీఎస్వో ఆఫీసులో మంగళవారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ వెంకటేశం, సీఐ పండరి పలు కీలక రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. 

గత పదేండ్లలో రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సీఎంఆర్ రికవరీ వివరాలను డీఎస్వో నర్సింగారావు నుంచి సేకరించారు. వరుసగా రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టి ధాన్యం మాయంపై కేసులు నమోదు చేయిస్తున్న విజిలెన్స్ ఆఫీసర్లు.. డీఎస్వో ఆఫీసులో తనిఖీలకు రావడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 

కాగా, సివిల్ సప్లై శాఖ సన్నరకం (గ్రేడ్ ఏ) ధాన్యం కేటాయిస్తే ఆ బియ్యాన్ని మార్కెట్ లో అమ్ముకుని, ఎఫ్ సీఐ గోడౌన్లకు మాత్రం దొడ్డు బియ్యం (కామన్ వెరైటీ) సరఫరా చేసి ఇటీవల జైలుకెళ్లిన రైస్ మిల్లర్లు లెంకలపల్లి మధు, సంపత్, వల్లాల మల్లికార్జున్, కల్లూరి కృష్ణమూర్తిని సీఐడీ పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో మంగళవారం కస్టడీకి తీసుకున్నారు.