జగిత్యాల : అమ్మ ఒడికి చిన్నారి..రెండు నెలల ఎడబాటుకు ఎట్టకేలకు తెర..రాత్రికి రాత్రే బిడ్డను అప్పగించిన ఆఫీసర్లు

జగిత్యాల : అమ్మ ఒడికి చిన్నారి..రెండు నెలల ఎడబాటుకు ఎట్టకేలకు తెర..రాత్రికి రాత్రే బిడ్డను అప్పగించిన ఆఫీసర్లు
  •     శిశు విహార్‌‌‌‌లో గుండెలవిసేలా ఏడ్చిన బాలుడు
  •     దృశ్యాలు వైరల్.. స్పందించిన మంత్రి సీతక్క

జగిత్యాల టౌన్, వెలుగు: పుట్టిన రెండు నెలలకే ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. మూడేండ్లుగా ఆ దంపతులనే అమ్మానాన్నలుగా ఎరిగాడు. వాళ్ల చేతుల్లోనే పెరిగాడు. కానీ రెండు నెలల కింద దత్తత వివాదం ఆ చిన్నారిని వారి ఒడి నుంచి దూరం చేసింది. శిశు విహార్‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తూ గడిపిన ఆ పసివాడు, ఎట్టకేలకు సోమవారం రాత్రి తనను పెంచిన తల్లిదండ్రుల చెంతకు చేరాడు. హైకోర్టు ఆదేశాలు, మంత్రి సీతక్క జోక్యం, కలెక్టర్ చొరవతో రెండు నెలల ఎడబాటుకు తెరపడింది.

దత్తతే దూరం చేసింది

ఆర్థిక స్థోమత లేక ఓ కుటుంబం మూడేండ్ల కింద తమ రెండు నెలల బిడ్డను, పిల్లలు లేని జగిత్యాల దంపతులకు దత్తత ఇచ్చింది. అప్పటి నుంచి ఆ దంపతులే చిన్నారిని కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు.  చట్టపరంగా దత్తత తీసుకోలేదంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆఫీసర్లు రెండు నెలల కింద బాలుడిని శిశు విహార్‌‌‌‌కు తరలించారు. బిడ్డ కోసం ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. చిన్నారిని తిరిగి వారికి అప్పగించాలని అక్టోబర్ 16న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా, అధికారులు ఆలస్యం చేశారు.

ఆ ఏడుపు అందరినీ కదిలించింది

ఎంతకీ బిడ్డ తమ దగ్గరికి రాకపోవడంతో ఆ దంపతులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతకుముందు బిడ్డను చూసేందుకు శిశు విహార్‌‌‌‌కు వెళ్లినప్పుడు, వారిని చూడగానే ఆ చిన్నారి గుండెలవిసేలా ఏడ్చాడు. తనను పెంచిన అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాలని ఆ పసివాడు పడిన తపన చూసినవారి కళ్లు చెమ్మగిల్లాయి. ఆ దృశ్యాలు టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరినీ కదిలించాయి.

సీతక్క ఆదేశాలతో..
ఈ దృశ్యాలపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ సైతం చొరవ తీసుకుని సీడబ్ల్యూసీ అనుమతులు, పరిపాలనాపరమైన ప్రక్రియలను త్వరగా పూర్తి చేయించారు. దీంతో కరీంనగర్ శిశు సంరక్ష ణ కేంద్రం ఆఫీసర్లు సోమవారం రాత్రే బాలు డిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిం చారు. రెండు నెలలుగా బిడ్డ లేక బోసిపోయిన ఆ ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. తమ బిడ్డ తిరిగి ఇంటికి చేరడంలో కీలక పాత్ర పోషిం చిన మీడియాకు, స్పందించిన మంత్రి సీతక్క కు, అధికారులకు ఆ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.