అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని కుంట్లూరులో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న ముఠా గుట్టును ఫ్యూచర్ సిటీ పోలీసులు రట్టు చేశారు. రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.
మంగళవారం అబ్దుల్లాపూర్మెట్ఠాణాలో వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి కుంట్లూరు నుంచి విజయవాడకు నకిలీ కరెన్సీ తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు, ఎస్ వోటీ బృందాలు సంయుక్తంగా రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ ఎదురుగా తనిఖీలు చేపట్టాయి.
ఓ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. రూ.500 నకిలీ నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ప్రధాన నిందితుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడెంకు చెందిన మడుపోజు కర్ణాకర్ యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు.
ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ సహాయంతో అసలు నోట్లను స్కాన్ చేసి, కలర్ ప్రింటర్ల ద్వారా నకిలీ రూ.500 నోట్లను ముద్రించారు. అంతేకాకుండా, ఈ ముఠా అసలు రూ.500 నోటుకు రూ.2 వేల నకిలీ నోట్లను ఇస్తూ మార్కెట్లో చెలామణి చేస్తోంది. పోలీసులు దాడులు చేసి కుంట్లూరులోని అద్దె ఇంటితోపాటు వాహనంలో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, కటింగ్, ల్యామినేషన్ మెషీన్లు, నకిలీ పోలీసు ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలను సీజ్ చేశారు. ఈ కేసులో మడుపోజు కర్ణాకర్, కూకట్ పల్లి వివేకానంద నగర్ చెందిన చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కుసునూర్పల్లికి చెందిన చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, మహబూబ్‌నగర్‌జిల్లా యెనుగొండకు చెందిన కరణం అజయ్ కుమార్ లను అరెస్ట్చేశామని, మరో ముగ్గురు నిందితులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్పేట్ కు చెందిన జెల్లి వెంకటేశ్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, జూలురుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన కుంజా బాలరాజు, కంపాసటి శ్రీనివాస్ పరారీలో ఉన్నారని సీపీ తలిపారు.
పోలీసులుగా నటిస్తూ వసూళ్లు..
నకిలీ నోట్లను చెలామణి చేసే సమయంలో నిందితులు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలతో పోలీసులుగా నటిస్తున్నట్లు సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. వీళ్లు గతంలో కొందరు వ్యాపారులని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు తేలిందని పేర్కొన్నారు.
