- పసుపు నీళ్లతో శుద్ధిపై ఈసీఐకి సతీశ్ మాదిగ కంప్లైంట్
- కేసీఆర్ పై కేసు పెట్టి, ఎమ్మెల్యే సభ్యత్వం తొలగించాలి
న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ను ఉల్లంఘిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో అంటరాని తనాన్ని ప్రొత్సహిస్తోన్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీఐ)కి మాదిగ, మాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత దేవని సతీశ్ మాదిగ ఫిర్యాదు చేశారు. ఈ వివక్షకు సహకరిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై కేసు నమోదు చేసి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం బొల్లె సైదులు మాదిగ, మంకాళి రాంచంద్రం మాదిగతో కలిసి ఈసీఐలో సతీశ్ కంప్లైంట్ కాపీని అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 న అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హంగామ చేయడంతో పాటు, దళిత వర్గానికి చెందిన స్పీకర్ ను వ్యక్తిగతంగా దూషించారన్నారు.
ఈ పరిణామాన్ని పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఖండించలేదన్నారు. దీన్ని నిరసిస్తూ.. తర్వాతి రోజు మాదిగ మాల జేఏసీ చైర్మన్ గా కేసీఆర్ మీద సావు డప్పు (నిరసన డప్పు)కు చలో ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ పేరుతో 1000 డప్పుల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అయితే.. సావు డప్పు కొట్టిన మాదిగ మాలలు, తన ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చారని మొదట వరదరాజా పూర్ గ్రామంలో దళితులు తిరిగిన నేల మైల పడిందని పసుపు నీళ్లతో శుద్ధి చేశారన్నారు. సెప్టెంబర్ 9న ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ పసుపు నీళ్లతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేత కేసీఆర్ పసుపు నీళ్లతో శుద్ధి చేయించారన్నారు.
అంటరానితనానికి కేసీఆర్ మళ్లీ ఆజ్యం...
దళితుల పట్ట కేసీఆర్ చూపిన ఈ వివక్ష ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోందని సతీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మళ్లీ ఈ అంటరానితనం అనే మహమ్మారి విస్తరణకు కేసీఆర్ ఆజ్యం పోశారని మండిపడ్డారు. సెప్టెంబర్ 8 తర్వాత సిద్దిపేట లో గణేశుని దగ్గర దళితులకు వేరుగా టేబుల్ వేసి బువ్వ పెట్టారన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లోనూ... చాలా గ్రామాల్లో మాదిగ, మాలల బతుకమ్మలు అంటూ వేరు చేయడంతో గొడవలు జరిగాయని గుర్తు చేశారు.
