బియ్యం బస్తాల్లో కిలోల కొద్దీ కోత.. హైదరాబాద్లో డీమార్ట్ సహా 36 చోట్ల రైడ్స్

బియ్యం బస్తాల్లో కిలోల కొద్దీ కోత.. హైదరాబాద్లో డీమార్ట్ సహా 36 చోట్ల రైడ్స్

హైదరాబాద్ లో సివిల్ సప్లై అధికారులు పలు వ్యాపార సంస్థలపై రైడ్స్ నిర్వహించారు. 2026 నవంబర్ 3న మలక్ పేట సర్కిల్ లో జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బియ్యం బస్తాపై ఉన్న బరువు తూకం వేస్తే లేకపోవటం చూసి అధికారులు షాకయ్యారు. సామాన్యులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మలక్‌పేట సర్కిల్‌లో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు  ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు.  బ్లాక్ మార్కెట్, అధిక ధరలు, తూకంలో మోసాలపై 36 చోట్ల సోదాలు నిర్వహించారు. దుకాణాలు, బియ్యం గోదాముల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. 

నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు బియ్యం వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు.  రెండు సంస్థలు ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. జీఎస్టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సుల్లోనూ లోపాలున్నట్లు కనుగొన్నారు. 

ధ్రువీకరణ లేని, సీల్ గడువు ముగిసిన తూకపు యంత్రాల వినియోగం చూసి ఆగ్రహించారు. తక్కువ బరువుతో బియ్యం విక్రయిస్తూ వినియోగదారులకు మోసం చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. 25 కిలోల బియ్యం బస్తాలు తూకం వేస్తే కొన్ని చోట్ల 24 కిలోలు, అంతకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బస్తాపై రాసిన బరువుకు, తూకంలో తేడా ఎందుకు ఉందని ప్రశ్నించారు. అలాంటి వ్యాపారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

మరోవైపు ప్రముఖ మాల్స్ లోనూ ధరల మోసాలు గుర్తించారు అధికారులు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, లీగల్ మెట్రాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు షోకాజ్ నోటీసులు అందించారు. కొందరిపై జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న సివిల్ సప్లై అధికారి నర్సింగ్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు.