మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. నవంబర్ 5న సాయిదుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్? వధువు ఎవరంటే?

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. నవంబర్ 5న సాయిదుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్? వధువు ఎవరంటే?

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గా తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆయన పెళ్లిపై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఈసారి మాత్రం నిశ్చితార్థం, పెళ్లి తేదీలతో సహా ఆసక్తికరమైన వివరాలు బయటకు రావడం అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. 

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. నవంబర్ 5న హైదరాబాద్‌లో సాయిదుర్గా తేజ్ నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా మెగా కుటుంబ సభ్యులు హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్‌లో హైదరాబాద్‌లోనే వివాహ వేడుక జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ సాయిదుర్గా తేజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులను వెంటాడుతోంది. ఆయన తన చిరకాల స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వధువు వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధమని మరోవైపు వార్తలు వస్తుండటంతో అసలు విషయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అప్పుడే సాయిదుర్గా తేజ్ కు విషెస్ తెలిపుతున్నారు ఫ్యాన్స్.

మరోవైపు సాయిదుర్గా తేజ్ గతంలోనే 2026లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిజం కాబోతుందనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి మెగా కుటుంబంలో మరో శుభకార్యానికి కౌంట్‌డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది. అయితే ఈ వార్తలపై సాయిదుర్గా తేజ్ ఎప్పుడు అధికారికంగా స్పందిస్తారో చూడాలి.